ఈ పుట ఆమోదించబడ్డది

అభిప్రాయములు

మహామహోపాధ్యాయులు, కవిసార్వభౌములు, శ్రీకృష్ణభారత గ్రంథకర్తలు నగు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు, రాజమహేంద్రవరము.

శ్రీయుత కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి సోదరులు వ్రాసి ముద్రించిన సంస్కృతన్యాయములు, అను గ్రంథము నేను జదివి మిక్కిలి యానందించితి. ఈన్యాయము ' లకారాది క్షకారాంత ' మక్షరానుక్రమణికగా సంగ్రహింపబడినది. సామాన్యముగా నీన్యాయములు, న్యాయాభిప్రాయములును బెక్కుమంది యెఱుంగరనియే నాయభిప్రాయము. కాకతాళీయన్యాయము, కర్కటీగర్భన్యాయము, అజగరన్యాయము, ఇత్యాదులు కొన్ని మాత్రమే లోకసామాన్యమునకు దెలిసినవై యున్నవి. వీరీ న్యాయసంగ్రహమం దెంతయేని శ్రమ చేసిరని చెప్పుట సత్యోక్తియే. పీలుపత్రఫలన్యాయము, ఉష్ట్ర లగుడన్యాయము ఇత్యాదులు చాలమందికి దెలియనివే యగుచున్నవి. ఇట్టి న్యాయములు సమగ్రముగా సంగ్రహించి ముద్రించి వీరు లోకమునకు మహోపకృతిం జేసియుండిరని చెప్పుచున్నాను.

ఈ న్యాయగ్రంథము ప్రతి కవిహస్తము నలంకరించి యుండానగు. కావున గవులును, బౌరాణికులును, పండితులును, ఉపాధ్యాయులును, విద్యార్థులును ఈ న్యాయగ్రంథమును స్వీకరింతురుగాక యని మనవి చేయుచున్నాను.

(Sd.) శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి