ఈ పుట ఆమోదించబడ్డది

9

సంస్కృతన్యాయములు

ఇక్షువికారన్యాయము
  • చెఱకుగడను గానుగలో నొక్కుటవలన రసము, ఆరసమును సరియగు పాకమున వండుటవలన బెల్లము, ఆ బెల్లము ద్వారా తదితర ఉత్తమోత్తమ మధురపదార్థములు తయారగును. అట్లే ఉత్తరోత్తర ముత్తమోత్తమ లాభప్రాప్తి నీన్యాయము సూచించును.
ఇక్షురసన్యాయము
  • మఱలలో పెట్టి గట్టిగ నొక్కినగాని చెఱకుగడనుండి రసము వెలికిరాదు.
  • (రోకళ్ళతో శక్తికొలది దంపినగాని బియ్యమురావుగదా!)
ఇషువేగక్షయన్యాయము
  • ధనుస్సునుండి విడువబడిన బాణముయొక్క వేగము లక్ష్యమువఱకు పోయిగాని క్షీణింపదు.
"ఇచ్ఛేష్యమాణసమభివ్యాహారే" అనే న్యాయము
  • ఏదేని యొకయిచ్ఛ జనించుటకు ఆయిచ్ఛను కలిగించు వస్తువే కారణ మగును.
  • హేతుహేతుమద్భావప్రసక్తి నీన్యాయము సూచించును.
ఉత్ఖాతదంష్టభుజగన్యాయము
  • కోఱలుతీసినపాము పైకి భయంకరముగ గాన్పించుటయే కాని కఱువజాలదు.