ఈ పుట ఆమోదించబడ్డది
ఈ పుట ఆమోదించబడ్డది


3

సంస్కృతన్యాయములు

అంధపంగున్యాయము
  • గ్రుడ్డివానిభుజమున కుంటివాఁడు కూర్చుండి మార్గము దెలుపుచుండ నిరువురును అన్యోన్యసాహాయ్యమునఁ దమ గమ్యస్థానము చేరుట.
అంధపరంపరాన్యాయము
  • ఒక గ్రుడ్డివాఁ డేదైన తెలివితక్కువపని చేసినయెడల తక్కినగ్రుడ్డివాం డ్రందఱు నదియే చేయుదురు.
  • (కొందఱు గ్రుడ్డివాండ్రు కలసి వెళ్ళుచు నందు మొదటి వాఁడు నూతిలోఁబడ, తక్కినవా రందఱు వరుసగ నూతిలోఁ బడినట్లు.)
అంధాంజనన్యాయము
  • గ్రుడ్డివానికంటికి కాటుక పెట్టినట్లు.
అంధాంధన్యాయము
  • గ్రుడ్డివానికి గ్రుడ్డివాఁడు త్రోవ చూపినట్లు.
అంధాశ్వపౌళిన్యాయము
  • గుఱ్ఱము గ్రుడ్డిదైనను గుగ్గిళ్ళు తినుటలో పెద్ద.
  • "గ్రుడ్డిగుఱ్ఱపుతట్టు గుగ్గిళ్ళు తినఁ బెద్ద." వేణుగోపాలశ. 17
అంధాక్షిమీలనన్యాయము
  • గ్రుడ్డికన్ను మూసినను తెఱచినను ఒకటే.
  • "గ్రుడ్డికన్ను దామూయకయున్న నేమి మఱి మూసిననేమి" రాధికాసాంత్వనం 3-18