ఈ పుట ఆమోదించబడ్డది
181

సంస్కృతన్యాయములు

స్థూణానిఖననన్యాయము

స్తంభము పాతిన పిదప అది జవ్వడక దృడముగా నుండుటకై చుట్టును మట్తికూరి యూపుచు మఱలమఱల దృఢము చేయుదురు.

ఒకవిషయమును తొలుత వచించి ప్రకారాంతరమున దానికి దార్డ్యమును గూర్చుపట్ల నీన్యాయము వర్తించును. "పునశ్చజగజ్జన్మాదిహేతుత్వ్గ మీశ్వరసాక్షిప్యతే స్థూణా నిఖననన్యాయేన ప్రతిజ్ఞాతస్యార్ధస్య దృడీకరణాయ."

స్థూలారుంధతీన్యాయము

వివాహసమయమున వధూవరులకు తేలికగ త్వరలో కనుగొనుటకు వీలుగ దగ్గఱనున్న పెద్దనక్షత్రమును జూపి ఆప్రక్కన మినుకుమినుకుమనునదియే అరుంధతీ నక్షత్రము, చూడుడు అని చూపించినట్లు.

రేఖాగవయన్యాయమును జూడుము.

స్నేహదీపన్యాయము

చమురు లేనిచో దీప మారిపొయినట్లు.

స్పటికలౌహిత్యన్యాయము

స్ఫటికము దగ్గ్తఱ జపాపుష్పము నుంచిన స్ఫటికము ఎఱ్ఱగా కాన్పించును; ఆపుష్పమును తీసివైచిన స్ఫటికము మామూలుగనే యుండును.