ఈ పుట ఆమోదించబడ్డది

విన్నపము

మిత్రుల ప్రోత్సాహముచే "లక్ష్మీగ్రంథమండలు" యను నొండు గ్రంథమండలి స్థాపించితిని. కేవల మీయది వృత్తిగా బెట్టుకొని గ్రంథముల మూలమున ధన మార్జించ వలయునని తలంపుగాదు. లోకోత్తరపురుషులచే వ్రాయబడి జీర్ణములైయున్న గ్రంథములను, సర్వజనోపయోగములగు పుస్తకములను బ్రకటించి, నా నేర్చినంత, ఆంధ్ర భాషామతల్లికి సేవచేయవలయునను సంకల్పమే నన్నీకార్యమునకు బురికొల్పినది.

కొన్ని సంవత్సరములనుండి "సంస్కృతన్యాయములు, సంస్కృత లోకోక్తులు, తెలుగు జాతీయములు, తెలుగు సామెతలు" పుస్తకరూపముగా బ్రకటించవలయునని యత్నించుచు, అందులకు వలయు కొంత సామగ్రిని సంపాదించి, నా మిత్రులగు, విద్వాంసుల కెరింగించితిని. వారును సంతసించి కొంతవరకు దోడ్పడిరి. అందు ముఖ్యులు శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి సొదరులు.

గ్రంథమండలియం దాదరముంచి సుప్రసిద్ధులు, మధురకవులునగు శ్రీ నాళం కృష్ణరావుగారు, వా రెన్నియో సంవత్సరములనుండి సేకరించుచున్న, కొన్ని సంస్కృతన్యాయములు, తెలుగు జాతీయములు, తెలుగు సామెతలు మాకు బ్రసాదించియుండిరి.