పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/97

ఈ పుట ఆమోదించబడ్డది

జేయుదునని రహస్యముగా శపథము బూని యున్నాడు. ఈసంగతి విన్నప్పటినుండియు నేను పొందుచున్న పరితాపమునకు మేరలేదు."

దమనకుని మాటలు విని సంజీవకుడు "సఖుడా! విషాద మొందకుము. దైవవశమున నెప్పు డేది వచ్చునో దానికి సిద్ధపడి యుండవలయును. ఆపద వచ్చినపుడు సమయానుసారముగా వర్తించి వీలయినచో దప్పించుకొనవలయును" అని పలికి యించుకనే పూరకుండి తనలో " ఈ వ్యవహారము వలన దుర్జనుల చిత్తవృత్తి యెట్టిదో తెలియుచున్నది. ఈలోకమున స్త్రీలు దుర్జనులకే వశులగుదురు. రా జపాత్రులనే యాదరించును. లోభికే ధనము లభించును. మేఘుడు కొండల యందు వర్షించును. ఎంతహాని సంభవించినది? ఎన్ని విధముల యత్నించి కొలిచినను రాజనకు దృప్తికలుగ దనుమాట ముమ్మాటికిని నిజము. ఇది యుపాయము గానరాని యపాయము. ఏలయన నెవరైన గారణముండి కోపించినచో నా కారణము తొలగగానే యదియుబోవును. కారణము లేకుండ బగ బూనినవాని కోప మెవరు పోగొట్టగలరు? రాజునకు నే నేమి యపకార మొనరించితిని? రాజు లనగా నకారణము గనే హాని సేయువారా? ఒక్కొక్కరాజు తనకు మేలు చేసిన వారి యెడనే పగవహించును. కీడొనరించిన వారియం దమితమగు ప్రీతి జూపును. సేవాధర్మమిట్టిది. ఇందలిరహస్యము యోగులకైన నెఱుగ రానిది.