పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/96

ఈ పుట ఆమోదించబడ్డది

మనసు చలింపనివాడును, రాజున కెల్లకాలము బ్రియుడై యుండగలుగువాడును, మృత్యువునకు వశుడు గానివాడును, యాచకుడై గౌరవము గాంచువాడును, దుష్టుల పన్నాగములకు లొంగి కుశలముగా దప్పించుకొనగలుగువాడును లోకమున నుండు టరిది."

దమనకుని పలుకులు విని సంజీవకు "డిపు డేమి యాపద దటస్థించినది? తెలుపు" మనగా దమనకుడు మరల నిట్లనియెను.

"ఏమని చెప్పుదును? దురదృష్టవంతుడును. సముద్రమున మునిగిపోవుచు సర్ప మాధారముగా లభించి నపుడు దానిని గ్రహించుట యెట్లు? విడచుట యెట్లు? ఒకవంక రాజవిశ్వాసము, మఱియొకవంక బంధువినాశము. ఏమి చేయుదును?" ఇట్లు పలికి నిట్టూర్పువిడిచి యూరకుండగా సంజీవకుడు "మిత్రమా! ఏది యెట్లు జరిగినను వృత్తాంత మంతయు నున్నది యున్నట్లు వివరింపుము" అని పలుకగా దమనకుడు మిక్కిలి సమీపమునకు వచ్చి రహస్యముగా నిట్లనెను.

"రాజవిశ్వాసమువలన నీసంగతి యెంతమాత్రము జెప్పరానిది. అయినను నీవు నాయందలి నమ్మకముచేత నిచటికి వచ్చిన వాడవు. పరలోకవాంఛవలన నీకు హితము చెప్పుట నా విధి. వినుము. మన ప్రభువు నీపయి నెంతయో యలుక జెందియున్నాడు. నినుజంపి సేవకులకు సంతర్పణము