పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/95

ఈ పుట ఆమోదించబడ్డది

మనవి యాలకించి విష్ణువు సముద్రుని దండించుట కాజ్ఞ యొసగెను.

సముద్రు డా సంగతి విని భయపడి పక్షిగ్రుడ్లన్నియు బంగారు పాత్రమున నిడి తీసికొనివచ్చి యా తీతువునకు సమర్పించెను. కాబట్టి సంజీవకుని క్షుద్రుడని తేలికగా జూడరాదు. తాము పరాకున నున్నపుడు దర్పమున గొమ్ములతో బొడువ వచ్చినపుడే యా సంజీవకుని స్వభావము గుఱుతింపవచ్చును." అని శక్య మయినంత వఱకు బోధించి సెలవు బుచ్చుకొని దమనకుడు మెలమెల్లగా సంజీవకుని కడకు బోయెను.

దమనకుడు సంజీవకునకు దుర్బోధ చేయుట

దమనకుడు చింతాకులుని వలె నుండుట జూచి సంజీవకుడు "మిత్రమా! కుశలమేకద! నీవింత దైన్య మొందినవానివలె నుండుటకు గారణమేమి?' యని ప్రశ్నింపగా దమనకు డిట్లనెను.

"సేవకునకు గుశల మనునది యెట్లుగల్గును? సంపదలా పరాధీనములు. చిత్త మెల్లపుడు నశాంతమై యుండును. జీవితమందు విశ్వాసముగూడ నుండదు. సేవకునివిధ మిట్టిది.

ధనము సంపాదించి గర్వింపని వాడును, విషయాసక్తుడై యాపదలకు లొంగనివాడును, తరుణుల జూచి