పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/92

ఈ పుట ఆమోదించబడ్డది

గింపని సంపదయు, నింద్రియములకు లోబడని పురుషుడును నుత్తములు. కాబట్టి యడుగకున్నను స్వామికి బరాభవము దటస్థించుట సహింపజాలక చెప్పుచుంటుని. సంజీవకుని తప్పు లన్నిటిని వినియు బ్రభు వూరకున్న యెడల నాదోషము లేదని తృప్తివడుదును."

ఇంతగా నొక్కిచెప్పుచున్న దమనకుని మాటలు విని "గుణదోషము లెఱుగక యేపనియు జేయరాదు. గర్వము చేత నెవడు సర్పమునోట జేయిదూర్చును? దోష మున్నచో దండింపక విడుచుటయు దప్పే. దోషము లేనిచో దండించుట యెంతమాత్రము దగదు." అని పింగళకుడు మనసున నాలోచించుకొని దమనకునితో "అతని నిరాకరించి వెడలగొట్టుట యుచితమా? హెచ్చరించి చూచుట మంచిదా?" యన దమనకు డిట్లనెను.

"వలదు, వలదు. ఇంతలోనే మంత్రభంగము గావింపరాదు. మంత్రబీజము భగ్నము గాకుండ బహుయత్నములచే గాపాడవలయును. ఒకసారియది భగ్నమైన నిక నది యంకురింప జాలదు. చేయదగినది యెవ్వరు నెఱుగకుండ వేగముగా జేయుట మంచిది. అధీరుడగు యోధుడు సర్వాంగములు గవచముచే గప్పుకొనియుండియు బరులు భేదింప గలరను భయమున జిరకాలము యుద్ధరంగమున నిలువ జాలడు. అట్లే మంత్ర మెన్నివిధముల గాపాడుచున్నను జిరకాలము నిలువజాలదు."