పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/78

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విషయము లన్నియు బాగుగా నాలోచించి సందర్భానుసారముగా మెలంగవలయును." సోదరుని యీ మాటలు విని పింగళకుడు "అది నిజమేయగును. కరటకదమనకు లీమధ్య నన్నివిధముల నాయాజ్ఞలకు బద్ధులై యుండుచున్నట్లు గానరాదు." అని చెప్పగా మరల స్తబ్ధకర్ణుడిట్లనెను.

"ఆజ్ఞ మీఱెడి వారిని క్షమించెనేని నాతనికిని జిత్రప్రతిమకు భేధమేమి? సోమరియైన వానికి గీర్తియు, సరళతలేనివానికి స్నేహమును, నింద్రియ నిగ్రహము లేని వానికి గులమును, ధనాశాపరునకు ధర్మమును, లుబ్ధునకు సౌఖ్యమును, వ్యసనములు గలిగియుండు వానికి విద్యాఫలమును, మంత్రుల విషయమై యేమఱియుండు నరపతికి రాజ్యమును నచిరకాలమున జెడిపోవును. కావున సోదరా! తప్పక నామాట పాటింపుము. సస్యము మాత్రమే తిని జీవించు సంజీవకునిం గోశాధిపతిగా నియమించుట యుక్తమని నాయూహ."

ఇట్లు పలికిన సోదరుని మాటల కంగీకరించి యప్పటి నుండియు బింగళకుడు సంజీవకుని గోశాధికారమున నియోగించెను. ఈ విధముగా బింగళక సంజీవకుల స్నేహము మఱింత ప్రబలెను. అంతేకాక యితరబంధువులందును, మంత్రులందును బింగళకుని కాదరము తగ్గిపోయెను.