పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత రాజు"చాలకాలమునకు గనబడితివి. సేమమా?" యని యడిగెను.

"ప్రభువులకు నావంటి యల్ప సేవకునివలనఁ బ్రయోజన మేమియుండును? అందుచేతఁ దఱచుగా వచ్చుటలేదు. సర్వసమర్థులగు మీ సత్పరిపాలనమున మాసేమమునకు లోటేమి యుండును? ఎంతటి యల్పుడైనను సమయము వచ్చినప్పుడు భృత్యుడు ప్రభువునకు దగిన యాలోచనము సెప్పుట ధర్మమని మీ దర్శనమునకు వచ్చితిని. పల్లు కుట్టుకొనుటకును, చెవి గోకికొనుటకును నెంతవారికిని గడ్డిపుల్లకూడ నుపయోగపడు చుండఁ గాలుసేతులు గల జంతు వెపుడైన నుపయోగింప కుండునా?

ధైర్యము గలవాని కవమానము గలిగినను మతిసెడదు. దివిటీ తలక్రిందుగా బట్టుకొన్నను దాని మంటలు మీదికి బ్రసరించుచునే యుండునుగాని క్రిందికి బ్రసరింపవు గదా! ప్రభువు లెఱుగని దేముండును? మణి పాదములందు దొరలినను దాని ప్రభ చెడదుగదా! గాజుముక్కను శిరమున ధరించినను దానికి శోభగలుగఁ జాలదు. పరిజనులందఱియందు భేదములేక రాజొకే తీరున వర్తించినయెడలఁ గ్రియాదక్షులగు వారు నిరుత్సాహు లగుదురు. పురుషులలో నుత్తములు, మధ్యములు, నధములు నని మూడు విధములు. వారిని మూడు రకముల పనులయందును నేలిక నియోగింపవలయును. వారికి వారికిఁ దగిన పనులందు యోగింపక వ్యత్యస్తముగాఁ