పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

న్నను నెవరికేది యిష్టమో యది సుందరముగనే కనబడును. ఎవనికేయది ప్రియమగునో తెలిసికొని బుద్ధిమంతుడు వానిని దనకు సముఖునిగా జేసికొనును. "అది నాపనిగాదు. సరిగా నాజ్ఞాపింపుము" అనిపలుకక యథాశక్తిరాజాజ్ఞను నెఱవేర్చు చుండవలయును. అధికమైన ప్రతిఫలము గోరనివాడై నీడవలె ననుసరించుచు నాజ్ఞకెదురాడక ప్రాజ్ఞుడు రాజసేవయందు బ్రవర్తింపవలయును.

ఏదైననొకవేళ రా జవమానము కలిగించునేమో యను నూహించి రాజసన్నిధి వీడరాదు. ఏదైన గీడుకలుగునని కర్తవ్యము విడుచుట యవివేకుల లక్షణము. అజీర్ణము కలుగునేమోయని భోజనము మానివైచు మూర్ఖుడెవ్వడైన నుండునా? అకులీనుడు, విద్యాహీనుడు, నయోగ్యుడునైనను సర్వదా కనిపెట్టుకొనియుండువానిని రాజు లాదరింతురు. రాజులు, లతలు, వనితలు తఱుచుగా దగ్గఱనున్న వానిపై నభిమానము చూపుట సహజము" అనిన విని గరటకు డంగీకరించి "సరే! నీవిపు డట కేగి యేమి పలుకుదువు?" అని ప్రశ్నింప దమనకు డిట్లు చెప్పెను.

"ముందుగా బ్రభువు నాకు సుముఖుడో, కాడో తెలిసి కొందును. దూరమునుండి చూచుట, మనవిచేయునపు డాదరము గలిగి వినుట, పరోక్షమున సుగుణముల నెన్నుట, ప్రియ విషయములు తటస్థించి నపుడు స్మరించుట, దానము, ప్రియ వచనము లాడుట, దోషములు గుణములుగా గ్రహించుట