పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

దమనకుని పలుకులు విని తుదకు గరటకుడు "సరే నీమాటలు యుక్తముగనే యున్నవి. ఇపుడేమి చేయవలయు నని నీతలంపు?" అని యడిగెను.

"మనరాజు నీరుద్రావుటకై యమునకు బోయి యెద్దుఱంకె వినియే భయపడి యదియేమో గుర్తింపలేక మరలి యింటికి బోయి విషణ్ణుడై యున్నాడు. ఇందు దెలియని దేమున్నది? ఈసంగతి యెవ్వరును జెప్పనక్కఱ లేదు. నోట జెప్పిన విషయములు పశువులు, హయములు, గజములు, సర్పములు గూడ గ్రహింప గలవు. చెప్పకుండ నాకారాదులచే బరుల యూహలు గ్రహింప గలవాడే పండితుడు. నేనిపుడు మనరాజు దగ్గఱకుబోయి సందర్భము ననుసరించి యవసరములయిన మాటలు సెప్పి యాతనిభయము బోగొట్టి యాతని బ్రసన్నునిగా జేసికొందును.

"సందర్భమునకు దగిన మాటలు, మంచితనమునకు దగిన ప్రియవచనములు, శక్తికి మించని కోపము గలవాడే వివేకి" యని దమనకుడు చెప్పగా "నీవు సేవాధర్మము నెఱుగవు. చూడుము. పిలువని పనికి బోవువాడును, నడుగనిదే సమాధాన మిచ్చువాడును, దనవిషయమున బ్రభువు ప్రీతుడై యుండెనని నమ్మువాడును నవివేకులు" అని కరటకు డనెను.

దానికి దమనకుడిట్లు జవాబిచ్చెను. "నేనుసేవాధర్మమునెఱుంగ కుండుటేమి? సహజముగా సుందరమైనను గాకు