పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

యుండిరి. బ్రాహ్మణుడు చదివిన శ్లోకములు విని రాజు తన కొమరులను గుఱించి యిట్లు తలపోసెను.

"విద్వాంసుడుకాని పుత్రుడు జనించిన బ్రయోజన మేమియులేదు. కంటిబాధయేకాని గ్రుడ్డికంటివలన నుపయోగ మేమి యుండును? గుణవంతులలో లెక్కకురాని సుతుని గన్న తల్లియు బుత్రవతియే యనిపించుకొన్న యెడల నింక గొడ్రా లన నెవరు? దానమున, దపమున, విద్యయందు, నర్థలాభమున బ్రశస్తినొందని సుతుడు గలుగుట కేవలము తల్లుల కడుపు జేటుకాదా?

వేలకొలదిగా నుండు తారలకంటె జందమామ యొక్కడే చీకటి సంపూర్ణముగా హరింప గలుగును. అటులే గుణహీనులగు పలువురు సుతులకంటె గుణవంతుడగు కుమారు డొక్కడే కులమునకు గీర్తి తేకలుగును. ధార్మికుడు, గుణవంతుడు, చెప్పినమాట వినువాడు నగు పుత్రుడు మహాతప మొనరించిన వారికేకాని లభించుట కష్టము. ధనలాభము, ఆరోగ్యము, ప్రియురా లగు భార్య, చెప్పుచేతలలో నుండు సుతుడు, నర్థసంపాదమునకు బనికివచ్చు విద్యయు లోకమున దుర్లభములు. పండితుడు గాని పుత్త్రుని బుత్త్రు డనుటకంటె శత్రు డనుట యుక్తము. ఎట్టి వంశమున జనించినను విద్వాంసు డైనయెడల బూజితు డగును. ఉన్నతవంశమున జననమొందినను బండితుడుకానివానికి గౌరవము కలుగనేరదు. సద్వంశజనితమైనను గుణరహితమగు