పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

లత్వముచేత మేకును బలవంతముగా నూడబెఱికెను. నెఱియలో జిక్కుకొనియున్న తోక నలిగివెంటనే యాకోతి బాధతో నఱచుచు మరణించెను. కావున మనకు సంబంధము లేని పనికి బోరాదు.

కరటకు డిట్లు చెప్పగా దమనకుడు, "స్వామి కార్యమునెడ నుపేక్షింపరాదు. ఒకపు డాతడు మనల నెట్లు చూచినను నాతడు మనకు ప్రభువు కాకపోడు" అని పలుకగా మరల గరటకుడు "ఆపని రాజోద్యోగులది. మన మిపుడు రాజోద్యోగులము గాము. కానపు డితరుల యధికారము పయి బెట్టుకొన గూడదు. పరుల యధికారము మీద బెట్టుకొనువాడు కుక్క మొఱుగుటకు బదులుగా నోండ్రవెట్టి దెబ్బతిన్న గాడిదవలె హాని నొందును. నీకా కథ చెప్పుదును;వినుము.

పరుల యధికారము మీద బెట్టుకొని మరణించిన గాడిద కథ

వారణాసి యందు గర్పూరపటు డను నొక చాకలి గలడు. వాడొక నాటి రాత్రి, పగలంతయు బట్ట లుదికిన బడలికచేత నొడలెఱుంగక నిదురించుచుండెను. అర్థరాత్రమున వాని యింటియం దొక దొంగ ప్రవేశించెను. వాని యింటిముందు గాడిద యొకటి కట్టివేయబడి యుండెను. ఆయింటి కావలికుక్కయు నచటనే కూరుచుండి యంతయు జూచుచుండెను.