పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/52

ఈ పుట ఆమోదించబడ్డది

మిత్రభేదము

అనంతరము రాజపుత్రులు విష్ణుశర్మతో "ఆర్యా తమదయవలన మిత్రలాభము వినియుంటిమి. ఇక మిత్రభేదము విన గుతూహలముతో నుంటి" మని పలికిరి. విష్ణుశర్మవారికిట్లు చెప్పదొడగెను.

"దక్షిణదేశమున సువర్ణపురమను నగరముగలదు. ఆనగరమున వర్ధమానుడను వణిజుడు నివసించుచుండెను. అతడు ధనికుడే యైనను దనకంటె నైశ్వర్యవంతులయిన బంధువులను జూచి వారికంటె నెక్కువ ధనము సంపాదింప వలయునని యూహించెను. తనకంటె దక్కువవాని జూచిన నెవ్వడైన నధికుడేయగును. తనకంటె నధికులను గుఱించి యాలోచించినపు డెంతవాడైన దాను దరిద్రుడుగనే యుండును.

"మహాపాతక మొనరించిన ధనముగల నరుడు పూజింపబడును. చంద్రునివలె స్వచ్ఛమయిన వంశమున బుట్టిన వాడైనను నిర్ధనుడు నిరాదరింప బడును. కావున ధర్మముదప్పని యేమార్గమున నైన ధనము సంపాదింపవలయును. ధర్మార్థకామమోక్షము లనెడి నాలుగు పురుషార్థముల లోపల నర్థమే ముఖ్యమయినది. అట్టిధనము సంపాదించి దానిం గాపాడి పెంపొందింప వలయును. పెంపొందిన దానిని సరియైన విధమున నుపయోగింపవలయును.