పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/45

ఈ పుట ఆమోదించబడ్డది

అని పలుకగా విని యజ్ఞసేన, "నాథా యిటువంటికోరికలు గోరుట మంచిదిగాదు. అనాగతకార్యములను గుఱించి యెవడు చింతచేయునో వాడు సోమశర్మ తండ్రివలె విషాదము నొందును. మీకాకథ దెలుపుదు వినుడు.

సోమశర్మ తండ్రి కథ

ఒకానొక బ్రాహ్మణకుమారుడు విద్యాభ్యాసము చేయుచు నొక బ్రాహ్మణుని యింట దద్దినపు భోజనముచేసి వచ్చుచుండెను.అతనికి వారు కొంత పేలాలపిండి యొసగిరి. ఆతడది యొక కుండలో నుంచుకొని తనయొద్ద బెట్టుకొని భుక్తాయాసము దీఱుటకై యొక యరుగుమీద బండుకొని నిదురవోయెను. అపుడు మితిలేని కోరిక లాతని మనసున గలుగ జొచ్చెను.

"ఇపుడు నాదగ్గఱ బేలాలపిండి యున్నదిగదా! నేను దీనిని విక్రయించి యొక పాడిమేకను గొనియెదను. దానికి రెండు పిల్లలు గలుగును. ఆ రెండును గొంతకాలమునకు రెండేసి పిల్లల నీనును. ఆనాలుగింటికి నెనిమిది పిల్లలు పుట్టును. ఈవిధముగా గొంతకాలమునకు వేలకొలదియు మేకలగును. తరువాత వాని నమ్మి నూఱావుల గొందును. అవి ప్రతి సంవత్సరము నీనుచుండును. కొన్ని సంవత్సరములకు వేలకొలది సంఖ్యగల యావులతోను, బెయ్యలతోను, కోడెలతోను దొడ్డి నిండియుండును. కొన్నికోడెల నరకలు గట్టించి