పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

ర్థ్యముచేత ఖ్యాతిగాంచును. నిండిన చెఱువును మండూకములు సేరినట్లు సర్వసంపదలు నుత్సాహవంతుడగు పురుషుని బొందును.

దేహికి సుఖదు:ఖములు కాలక్రమమున సంభవించుట సహజము. సంపదగలిగినపుడు గర్వము, నాపద గలిగినపుడు ఖేదము దగవు. ధనములేకున్నను వీరుడు గౌరవము సంపాదింపగలడు ఎంతధనమున్నను నీచునకు గౌరవ మించుకయైన గలుగదు. కుక్కకు బంగరునగ లెన్నితొడిగిననను సింహమునకుండు సహజతేజస్సు గలుగదు గదా! మేఘముల చాయము, ఖలుల ప్రీతియు, యౌవనము, ధనము గొలది కాలముమాత్రము నిలిచియుండును. పుట్టించినప్రాణు లందఱకు నాహారము దేవుడే యేర్పఱుపక మానడు. కాబట్టి యాహారమునకై యంతప్రయాసపడ నక్కఱలేదు. ధనము లేవిధమున జూచినను దు:ఖ కారణములే యగుచున్నవి. ముందు ముందు సంపాదించుట కష్టము. పిదప దానివలన గలుగు గర్వము కలిగించు దు:ఖము లనంతములు. సంపాదించిన ధనములకు హాని గలిగిన నెట్టిదు:ఖము గలుగునదియు వర్ణింప జాలము.

ధర్మకార్యములపేరు చెప్పి ధనము సంపాదించుటయు ననవసరము. అడుసు ద్రొక్కనేల? కాలుకడుగ నేల? ఆకసమున బక్షులచేతను, నేలమీద బులులచేతను, జలములందు మకరములచేతను నామిషము భక్షింప బడుచుండును. ధనికు