పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

"అర్థములు నిలుకడ గలవికావు. యౌవనము సెలయేటి నీటివంటిది. జీవితము నీటిబుడగవంటిది. తగినకాలమున ధర్మ మాచరింపనివాడు వార్ధక్యమొంది పశ్చాత్తాప మనెడి యగ్నిచే దహింపబడును. నీ వతి సంపాదనము జేసితివి. అందుచేతనే బాధకలిగినది. తటాకజలముపొంగి గట్లు త్రెంచి వేయకుండుటకు జలమును విడుచు తూఱ యవసరమైనట్టు సంపాదింపబడిన ధనమునకు దానమనెడి రక్షణ మావశ్యకము. ధనము పాతఱలో దాచుట దాని నాశనమునకు దారి చూపుటయే.

తన సుఖము లెక్కింపక ధనము సంపాదించువాడు పరులబరువు మోయువానివలె శ్రమకుమాత్రమే పాలగును. దానభోగములే ధనమునకు ఫలములు. అవిలేని ధనికుడు దరిద్రునికంటె నధికుడుగాడు ధనమున్నను సుఖముగా ననుభవింపనివాడు దరిద్రునితో సమానుడే. సంపాదించుట యందును రక్షించుటయందును శ్రమ మాత్ర మాతనికి విశేషము. మంచిమాటలతోడి దానము, గర్వములేని జ్ఞానము, నోర్పుతోడి పౌరుషము బ్రశస్తములు. ధనసంపాదన మవసరమే యైనను దానియం దతివాంఛ దగదు. పూర్వ మొక నక్క యెక్కువ సంపాదింపగోరి వింటి దెబ్బచే మరణించెను. నీకా కథ చెప్పుదును వినుము.

అతి సంపాదనేచ్ఛచే వింటిదెబ్బతగిలి మరణించిన నక్కకథ

కల్యాణకటకమను పట్టణమున భైరవు డనెడి బోయవాడు గలడు. వా డొకనాడు వేటకై యడవి కేగెను.