పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

కదలజాల డయ్యెను. అపు డాపులి "అయ్యో! బురదలో బడిపోయితివి. నిన్ను లేవదీయుదు" నని నెమ్మదిగా సమీపమున కేగి యాతని బట్టుకొనియెను.

అట్లు పట్టువడి, "క్రూరజంతువును నమ్మి గొప్ప తప్పిద మొనరించితిని. నదులయందును, శస్త్రప్రాణులయందును, గోళ్లు కలిగిన జంతువులందును, కొమ్ములు కలిగిన జంతువులందును, స్త్రీలయందును, రాజకులములందును విశ్వాస ముంచరాదని పెద్దలు వచింతురు. గతించిన దానికి విచారించిన బ్రయోజనమేమి? విధి దప్పించుకొన నెవ్వరికి దరమగును? చంద్రు డున్నతమైన గగనమార్గమున జరించును; కల్మషమును హరించును. అనేకకిరణములను ధరించుచు జ్యోతిర్మధ్యమున సంచరించును. అంతటి ఘను డైనను రాహు కేతువులచే మ్రింగ బడుట తప్పలేదుగదా!" అని విచారించుచు బులిచే జంపబడెను.

బాగుగా జీర్ణమయిన యన్నమును, జక్కగా జదివిన కుమారుడును, సుశిక్షితురాలైన స్త్రీయును, బాగుగా సేవింప బడిన ప్రభువును, ఆలోచించి యాడిన మాటయు, నిదానించి యొనరించిన కృత్యమును నెన్నడు హాని కలిగింపవు. కాబట్టి బాగుగా నాలోచింపనిదే యేపనియు జేయరాదు.

చిత్రగ్రీవుడు పలికిన యీమాటలు విని యొక పావురము నవ్వి గర్వముతో నిట్లనెను. "ఎల్లపుడు నిట్టి యుపయోగములేని శంకలు పెట్టుకొన్నచో నాహారము సంపా