అనుబంధము
రామదాసుయొక్క వ్రాతలలోనుండి కొన్ని యాంధ్రీకరించి యీ క్రింద బొందుపఱచుచున్నాను.
1. రాజధర్మం
రాజధర్మమును గుఱించి యీ క్రిందివిధముగ రామదాసు వ్రాసెను.
అంతరాయములకెల్ల నంతకు డగు గణేశ్వరుని, విజ్ఞానాధిదేవతయైన సరస్వతిని మా యిలవేల్పైన శ్రీరాముని స్తవము జేసి రాజధర్మమునుగుఱించి యీ క్రిందివిధముగ జెప్పుచున్నాను. వినువారి కెవరికైన నిష్టములేనిపక్షమున దానిని త్రోసివేయుడు. వివేకమునుబట్టి సౌఖ్యము గలుగును. కార్యసిద్ధులు పున:పున: ప్రయత్న ఫలములు. ఏమనుష్యునిగాని కొలువులో బెట్టకమునుపు వానినిగుఱించి బరీక్షించి వాని గుణములు గ్రహింపవలెను. పనికిమాలినవాండ్రను దూరముగ నుంచవలెను. ప్రతి కార్యముయొక్క సర్వభావమును, పర్యాప్తిని గ్రహించి చేసినపక్షమున నది తప్పిపోక చేసినవానికి శ్రమ లేకుండ జేయును. కార్యమారంభించిన వానియొక్క గుణమును బట్టియు శక్తినిబట్టియు గార్యసిద్ధి కలుగుచుండును. కొందఱు మందవర్తనులు తలబిరుసువాండ్రు కొలువులో నుందురు. కాని వారితప్పులను మహోదారమనసుతోను బ్రసన్నచిత్తముతోను క్షమించవలెను. రాజద్రోహులను వెంటనే యడచి వేయవలెను. తగినవిచారణ లేక నిరపరాధిని వట్టి యనుమానముమీద నడచివేయగూడదు సేవకులను సదా సంతుష్టులుగాను, సంతోషవంతులుగాను జేయుటచేత మన యదృష్టము వృద్ధిబొందును. కాని కొన్నిసమయములయందు సేవకులలో గొందఱు కఠినపద్ధతుల కర్హులై యుందురు. మనుష్యులనే సమయముల