లేదు" రోగము క్రమక్రమముగ వృద్ధిబొందెను. చరమదశ వచ్చెను. అన్ని మఠములనుండి శిష్యులందఱు చేరిరి. ఈ మఠములయొక్క యధికారము, తన యన్నగారైన శ్రేష్ఠుని కొమరునకు నప్పగించెను. తన మరణానంతరమున తనతో, మాటలాడదలచినవారు దాసబోధలో జెప్పబడిన ప్రకారము నడచుకొనవలెనని, యానతిచ్చెను. అతడు రెండురోజులకు చనిపోవుననగా దేశమంతటినుండి భక్తులు, శిష్యులు, కొన్ని లక్షలమంది వచ్చి, మఠమును జూట్టవేసిరి. ఆకసము మాఱు మ్రోగునట్లు, రామభజనలు జరిగెను. రామదాసుడును, తన యిష్టదైవతమగు రామనామము స్మరించుచుండెను. పదునొకండుసారులు రామ, రామ యనుచు, రామదాసుడు, ప్రాణములు విడిచెను.
ఆతని మరణముచేత, మహారాష్ట్ర మంధకారబంధుర మయ్యెను. మహారాష్ట్రుల పాలిటి కోహినూర్ రత్మము పోయెను. ఇతడు 1681 సంవత్సరమున మాఘమాసమున శుద్ధ నవమినా డస్తమించెను. అది మహారాష్ట్ర శకము ప్రకారము 1603 వ సంవత్సర మయ్యెను. ఈ దినము, మనదేశము భీష్ముని యేకాదశివలె మహారాష్ట్ర దేశ మంతటను దాసనవమి పేరిట బరగుచుండును. ఆదినమున, నేటేట నుత్సవములు, నుపవాసములు, భజనలు జరుగుచుండును.
- చరమ ప్రకరణము సమాప్తము.