ఈ పుట ఆమోదించబడ్డది

భక్తిప్రపత్తులతో గూడ నిండియుండెనో యీ విషయమును బట్టి తెలిసికొనవచ్చును. రామదాసుడు తన శిష్యు డెంత యాత్మజ్ఞానముకలవాడయ్యెనో తెలిసికొని సంతోషించి రాజ్యము మఱల నతని కిచ్చివేసెను. "శివబాబా! నన్ను గుఱించి నీ వేమనుకొనుచున్నావు? నేను వట్టి సన్యాసిని. నే నీ ధరాభారము వహింపగలవా? నీవంటి క్షత్రియులు మాత్రమే యీ రాజ్యధర్మము సమర్థముగ నిర్వహింపగలరు. నాయనా! వెనుకటి వలెనే స్వార్థత్యాగ పరతంత్రుడవై రాజ్యపాలనము చేయుము. అట్లు చేసిన ముక్తి నీకు సన్నిధాన వర్తినియై యుండును. నీవు నాకిచ్చిన రాజ్యము మఱల గ్రహించుట నీ కిష్టము లేదు గనుక నాపక్షమున నీవు ప్రతినిధివై యుండి భూమండలపరిపాలనము చేయుమని నే నిప్పుడు నిన్నాజ్ఞాపించు చున్నాను. ఇందుకు నిదర్శనముగ నీ ధ్వజమునకు నా శాటిగుడ్డరంగు గల కాషాయవస్త్రము గట్టుకొని వ్యవహరింపుము. శివాజీ గురువాజ్ఞ శిరసావహించెను. నాటంగోలె మహారాష్ట్ర హిందువుల జండా "భగవత్ జండా" యని పేరు పడెను.


________