నీవు సన్యసింపగూడదు. ఈ ధర్మములు వదలినయెడల నీకు మహాపాపము సంక్రమించును. నీవింకను జేయవలసిన మహాకార్యములు పెక్కులున్నవి. ఈ మ్లేచ్ఛులచేత జగ మెట్లాక్రమింపబడినదో నీవు చూచుట లేదా? మహామహు డైన రఘురాముడు భూమినంతను మ్లేచ్ఛులనుండి విడిపింప గోరుచున్నాడు. ఈ ధర్మమును నిర్వర్తించితివా, కఠినతపస్సు చేసిన వారికంటె నెక్కువగా నీకు ముక్తి కరతలామలక మగును. రాముడు, హనుమంతుడు, పాండవులు మొదలగు మహాపురుషులు చరిత్రములు నీ వెఱుగుదువు. వారు ధర్మము నిమిత్తము తమ సర్వస్వము ధారపోసిరి. ఎంత గొప్ప వంశమునుండి నీ వుద్భవించితివో యదియు నీ వెఱుగుదువు. నీ పూర్వులైన సిసాద్‌సింగ్, పృథ్వీపాల్‌సింగ్, లక్ష్మణసింగ్ మొదలగువారి చరిత్రలు జ్ఞప్తికి దెచ్చుకొనుము. వారి యడుగుల జాడనే వర్తింపుము. నీకు దారి చూపుటకే వారి చరిత్రలు వ్రాయబడియున్నవి" యని రామదాసుడు శివాజీకి క్షత్రియ ధర్మమును, రాజధర్మము నుపదేశించెను. ఈ యుపదేశవాక్యములు శివాజీని స్వధర్మమువైపు ద్రిప్పెను. తన కభిషేకించినసొమ్ము ప్రోగుచేసి పేదగొల్లపిల్లలు గ్రహించి సుఖించుటకై యడవిలో నన్నిప్రక్కల వెదజల్లు మని చెప్పెను. మఱునాడు నీలవంతు మొదలయిన శివాజీ యనుచరులకు గూడ రామదాసు డుపదేశించెను. ఆయుత్సవము ఛాఫల్ మఠములో మహావైభవముతో జరిగెను. శివాజీయొక్క యుద్యోగస్థులకును రామదాసుయొక్క శిష్యులకును సంతర్పణలు జరిగెను. శివాజీ బ్రాహ్మణులకు నన్నవస్త్రము లిచ్చి గురుదక్షిణగా రామదాసుని పాదములపై నపారధనరాసులు పోసెను. అప్పుడు గొప్పసభ జరిగెను. రామదాసుడు శివాజీ యనుచరులలో గొందఱ కుపదేశము చేసెను. అత్తఱి బాలాజీ నీలవంతుల విశ్వాసమును రాజభక్తిని రామదాసున కెఱుక పఱచి కొని యాడెను. రామదాసు డదివఱకే వారి సౌశీల్యమెఱిగినవా డగుటచే వారికిగూడ నుపదేశము చేసెను. ఉపదేశానంతరమున రామదాసుడు సేవకధర్మమునుగుఱించి ప్రసంగించెను. ఈ సేవకధర్మము వాని గ్రంథములలో గూడ గలదు. అంతవఱకు బాలాజీ శివాజీకి మిత్రుడై పనిచేసెను. అంతటినుండి యత డతనిగురుబంధు
పుట:SamardaRamadasu.djvu/63
ఈ పుట ఆమోదించబడ్డది