ఈ పుట ఆమోదించబడ్డది

మహాపురుషుడు కనబడెను. మీరెవ రని యడుగగనే రామదాసుడ నని చెప్పెను. మరునా డుదయమున శివాజీ నిద్రమేల్కొనక మునుపే రామదాసు వద్దనుండి యొక సన్యాసి జాబుతెచ్చి వాకిట నిలిచియున్నాడని సేవకులు శివాజీకి జెప్పిరి. వెంటనే యతడు పానుపు దిగి యాసన్యాసికి నమస్కరించి గౌరవించి యా జాబు నందుకొని దానికి నమస్కరించెను. ఆ జాబులో నిట్లుండెను. "యాత్రకు బోవలసిన పుణ్యక్షేత్రములన్నియు నాశము చేయబడినవి. బ్రహ్మక్షేత్రము లపవిత్రము చేయబడినవి. ప్రపంచ మంతయు నల్లకల్లోలము జేయబడినది. ధర్మమెచ్చటను గానబడదు. ధర్మమును గాపాడుటకై భగవంతుడు నిన్నేర్పఱచినాడు. ఈ దేశమున ననేక మహారాజులు మంత్రులు రాజనీతికోవిదులు గొప్పపండితులు నున్నను ధర్మము రక్షించు వారెవ్వరును లేరు. మహారాష్ట్ర ధర్మమంతయు నీ మీదనే యాధారపడి యున్నది. నేను నీ రాజ్యములోనే యిన్నినాళ్ళున్నప్పటికి నన్ను నీవు కనుగొనుటయే లేదు. అందుకు గారణ మేమో నే జెప్పజాలను. నీ మంత్రులు బుద్దిమంతులే. నీవు ధర్మమూర్తివి. అందుచేత నీకు మాటిమాటికి హితోపదేశము చేయనక్కఱలేదు. ధర్మము పునరుద్ధరించుట యను ప్రతిష్ఠ నీకే దక్కవలెను. అది నీవు పోగొట్టుకొన గూడదు. అతి మాత్రములైన రాజకీయ విషయములపై నాశ్రద్ధ నిలిచి యున్నది. ఈ యుపదేశమునకు మనసున నాగ్రహింపక నన్ను క్షమింపుము." ఈజాబు మనస్సును గఱగించునట్టి జాలిమాటలతో మహారాజు గౌరవమునకు దగినట్లు వ్రాయబదినది. ఆ రాయబారము తెచ్చిన సన్యాసిని శివాజీ మన్నించి పూజించి విలువగల వస్త్రముల బహుమాన మిచ్చి పంపెను. వెంటనే రామదాసుని యొక్క పాదపద్మములయొద్ద బడుటకు దాను బయలుదేరి వచ్చుచున్న ట్లొక ప్రత్యుత్తరము వ్రాసి యా సన్యాసి కిచ్చి పంపెను. ఆ దినముననే శివాజీ స్వల్ప పరివారముతో నిద్దఱు ముఖ్యమిత్రుల వెంట బెట్టుకొని రామదాసును గలిసికొనుటకు బయలుదేరి ఛాఫల్ మఠమునకు బోయెను.

అంతకుముందే రామదాసు డా మఠమును విడిచి షైగాన్ వాడీకి వెళ్ళిరని శిష్యులు చెప్పిరి. ఆ మఠమున అక్క యను నొక యువతీమణి