మున బౌద్ధమతము స్థాపించెను. బౌద్దమతము హీన దశలో నున్నకాలమున శంకరాచార్యులు, రామానుజాచార్యులు జన్మించి ఆస్తిక మతస్థాపనజేసి దేశీయుల నుద్ధరించిరి. ఆ విధముగనే మహారాష్ట్రదేశము విదేశీయుల పాలనకు లోబడి దేశస్వాతంత్ర్యమును మతధర్మములను గోల్పోయినతఱి దేశాభిమానియు రామభక్తాగ్రగణ్యుడును నైన సమర్థ రామదాసుడు జన్మించి మహారాష్ట్రులను మంచిమార్గమున బ్రవేశపెట్టెను. మహారాష్ట్ర దేశమున సతారా మండలమున జాంబ్ అని యొక గ్రామము కలదు. ఆ యూరిలో నిరువది యొక్క తరములనుండి ధొసరా కుటుంబమువారు నివసించుచుండిరి. రామదాసు డాకుటుంబములోని వాడే. వారివృత్తి గ్రామపౌరోహిత్యము, వారప్పుడప్పుడు కరణములుగ గూడ పని జేయుచుండిరి. ఆ వంశవృక్షములో మనకథానయకుడైన రామదాసుని తండ్రి సూర్యాజీ యిరువది రెండవ పురుషుడు. ఆయన భార్య పేరు రాణూబాయి. ఆ వంశస్థులందఱు మొదటి నుండియు రామభక్తులై యుండిరి. పూర్వుల మార్గము తప్పకుండ సూర్యాజీకూడ రామపదభక్తుడై యుండెను. ఆ దంపతులకు రాముని మీద నెంత భక్తి యనగా శ్రీరాముడే వారికి సాక్షాత్కరించుచుండు ననియు నతడే వారికి రామమంత్రోపదేశము చేసెననియు లోకులు చెప్పుకొందురు. వారి పవిత్రజీవనము గ్రామవాసులందఱకు మార్గదర్శకముగ నుండెను. ఆ దంపతులు ప్రాచీన మహర్షులచేత రచింపబడిన సకల గృహస్థధర్మములు నిత్యము నిర్వర్తించు చుండిరి. అందుచేత గ్రామవాసులేగాక యితర ప్రదేశ నివాసులు గూడ వారిని మిక్కిలి గౌరవించుచుండిరి. ఆ వంశము యొక్క ప్రతిష్ఠ నిలుపుటకై యా దంపతులకు వారి తప:ఫలములో యనునట్లు కుమారులిద్దఱు గలిగిరి. అందు మొదటివాడు శ్రేష్ఠుడు. రెండవవాడు రామదాసుడు. మంచి దంపతులకు మంచిబిడ్డలే పుట్టుదురు. దుష్ట దంపతులకు సాధారణముగ దుష్టులే జనించుచుందురు. సూర్యాజీవంతునకు మొదటికుమారుడైన శ్రేష్ఠుడు క్రీస్తుశకము 1605 సం||న జన్మించెను. ఆ కుమారునకు మొట్టమొదట గంగాధరుడని పేరు పెట్టిరి. అతడు సంతానములో జ్యేష్ఠుడును, గుణములచేత శ్రేష్ఠుడు నగుటచేత శ్రేష్ఠు
పుట:SamardaRamadasu.djvu/6
ఈ పుట ఆమోదించబడ్డది