ఆఱవ ప్రకరణము
అప్పటి దేశస్థితి
ఆ కాలమున మహారాష్ట్రదేశము మిక్కిలి దుస్థితిలో నుండెను. ప్రజలలో నైకమత్యము లేదు. దేశాభిమానమంతకుమున్నే లేదు. ఆత్మలాభపరాయణత్వమేగాని, స్వార్థత్యాగము లేదు. ఆత్మగౌరవ మంతరించెను. పరసేవాసక్తి క్షీణమయ్యెను. ఆ నాడు మహారాష్ట్రదేశములో దక్షిణమున బిజాపురసుల్తాను పాలించుచుండెను. కన్నడదేశమున గొంత భాగమును, మహారాష్ట్రమున గొంతభాగమును బిజాపూరు ప్రభువుల పాలనకు లోబడియుండెను. దేశమందలి సరదారులు వీరులు బిజాపూరు సుల్తానుల కొలువులో జేరి స్వదేశస్థుల మీద కత్తిగట్టి ప్రభువుల యనుగ్రహమునకు బాత్రులై వారిచేత బిరుదులు, ముఖాసాలు, జమీలు స్వీకరించి యధికారుల కనుసన్నల మెలగుచు దైవభక్తిగాని దేశభక్తిగాని లేక బానిస లట్లు మెలగుచుండిరి. కత్తిపట్టి పోరాడగల బంట్లు సయితము సుల్తానుల పటాలములలో జేరి పొట్ట బోసుకొనుచుండిరి. బిజాపూరు సుల్తానులు, అహమ్మదునగర సుల్తానులు, లేనిపోని వంకలు గల్పించుకొని యుద్ధములు చేయుచుండిరి. దేశస్థుల యర్థప్రాణములకు క్షేమము లేదు. స్త్రీలమాన ప్రాణములు దక్కించుకొనుట కష్టముగ నుండెను. అప్పుడప్పుడు మహమ్మదీయ ప్రభువుల సేనాపతులును సరదారులును దేవాలయములపై బడి దోచి నాశనము చేయుటయు గలదు. ఈస్థితి రామదాసుడు చక్కగ గ్రహించి స్వదేశమును నుద్ధరించుటకు సమకట్టెను. రామదాసుకంటె బూర్వము తుకారాము, ఏకనాథుడు, వామదేవుడు మొదలగు భక్తులు బయలుదేరి దేశస్థుల హృదయములలో నొక కొంత యాత్మ జ్ఞానమును దైవభక్తిని నెలకొల్పిరి. వా రాపని జేసియుండుట చేతనే రామదాసు పని సులభ మయ్యెను. యాత్మజ్ఞానము, దైవభక్తి కొంతయైనను గుదిరన గాని,