ఈ పుట ఆమోదించబడ్డది
తే. గీ. దేవదేవుడౌ శ్రీరామదేవుని కయి
యాప్తబంధువులును బరిత్యాజ్యు లవని
శాశ్వతసుఖంబు గోరెడి జనము లెల్ల
ప్రబల దు:ఖకారణమైన బంధుజనము
విడచి శ్రీరామపూజకే గడగవలయు.
తన చిన్న కుటుంబముయొక్క క్షేమమునేగాని విశ్వ మానవకుటుంబ క్షేమము నఱయువాడు స్వార్థత్యాగము తప్పక చేయవలెను. నారాయణు డొక్కడే సంసారసుఖము నపేక్షింపక యట్లు చేసినవాడు. బ్రహ్మచర్యమే యుత్తమోత్తమమని నారాయణుడు గట్టిగ నమ్మెను. అతని భవిష్యజ్జీవిత మంతయు దానిమీదనే యాధారపడెను. గృహస్థాశ్రమమన్న నతడు భయపడలేదు. నిజముగ నతడు గృహస్థుడైన పక్షమున సంసారిక యుద్ధము లతడు మిగుల శౌర్యముతోను మనోబలముతోను జేసి గెలిచి యుండును. కాని తాను తల పెట్టిన కార్యమునకు వైవాహికబంధ మెంత యాటంకమో యతడు తెలిసికొనెను.