ఈ పుట ఆమోదించబడ్డది

యుపదేశించి గురువు కమ్మని ప్రార్థించెను. అప్పు డుపదేశమునకు సమయము కా దనియు, దానికి దగిన కాలము వచ్చుననియు, నంతవఱకు వేగిరపడ వద్దనియు శ్రేష్ఠుడు తమ్ముని బ్రతిమాలి తండ్రివలె బుజ్జగించి చెప్పెను. అన్నగారి యాలోచనము నారాయణుని మనస్సునకు నచ్చనందున నతడు తలచిన తలంపు మానుకొనుట కిష్టము లేకపోయెను. అన్నగారు చేయని యుపదేశమును స్వయముగ దేవుని చేతనే చేయించుకొనవలెనని తిన్నగ మారుతి దేవాలయమునకు బోయెను. కన్నులవెంట బాష్పములు గ్రమ్మ నారాయణుడు మిక్కిలి భక్తితో మారుతిని బద్యములతో స్తవము చేయనారంభించెను. ఆతడెక్కడకు వెళ్లెనో యింటిలో నెవరికిని దెలియదు. పగలెల్ల నతడు స్తవము చేసిన పిదప రాత్రి ప్రారంభమాయెను. భక్తిపరిపూర్ణదశ నొందెను. అతని మనోనిశ్చయము వయస్సును మించిన దయ్యెను. కన్నులు బాష్పములతో నిండెను. గొంతు బొంగురు వోయెను. చిట్ట చివర కతడు గర్భాలయములో నొక చీకటిమూల మూర్ఛ పోయెను. అర్ధరాత్రమున దివ్యతేజ స్పొకటి బయలుదేరి గుడియంతయు వెలిగించెను. అంత నారాయణుడు మేల్కొనెను. తెలివి వచ్చెను. అప్పు డతనికి దివ్య తేజస్సుతో మారుతి ప్రత్యక్ష మయ్యెను. నారాయణుడు వాని పాదములపై బడి భక్తితో స్తుతి చేసెను. నారాయణున కుత్సాహ మెక్కువ కాగా బాష్పపరంపరచేత నాదేవుని పాదముల నత డభిషేకించెను. ఆ బాలకుని యసమానభక్తికి సంతసించి మారుతి శ్రీరామదేవుని దర్శనము చేయించెను. శ్రీరాముడు స్వయముగ నారాయణున కుపదేశము చేసెను. ఆ యుపదేశమహిమ చేత నారాయణుని హృదయము భక్తిపరవశ మయ్యెను. అప్పుడు శ్రీరాము డిట్లాజ్ఞాపించెను. "ఈభూమియంతయు నపవిత్రులైన మ్లేచ్ఛులచేత పాడయినది; కాన, నారాయణా! నీవు స్వార్థత్యాగివై కృష్ణా నదీ తీరమున విరాగివై తపస్సుచేసి లోకముంస్ నవీనపద్ధతి నవలంబించి దివ్యజ్ఞానము వ్యాపింపజేయవలెను." నారాయణు డింటినుండి వెళ్లినది మొదలుకొని తల్లి వానికొఱకు జిత్తక్షోభనొందెను. ఇరుగుపొరుగువారును మిత్రులును వానికొఱకు వెదకి వెదకి విసిగి యుండగ శ్రేష్ఠుడు సరిగ మారుతి గుడికి వెళ్లి తమ్ముని దోడ్కొని వచ్చెను.


_______