ఈ పుట అచ్చుదిద్దబడ్డది

87

సకలనీతిసమ్మతమునఁ బంచతంత్రిపేర నుడివిన గ్రంథము లభింపదయ్యె. కర్తపేరు నెఱుంగ సాధ్యము గాదు. ఈ కవి లభించుచున్నపంచతంత్రములకర్తలకంటెఁ బ్రౌఢుఁడని వెంకటనాథాదులపద్యముల బోల్చి చూచిన నెఱుంగవచ్చును.

నీతిభూషణమును నాంధ్రభోజుఁ డనుకవి రచించిన ట్లొకలక్షణగ్రంథమునఁ గలదు కాని యతఁ డెవ్వఁ డని గుర్తింప వీలుకాదు. బాలబోధలక్షణమున దీనిలోనుండి పెక్కుపద్యము లుదాహృతము లయ్యె. అందు.

మ.

సకలస్థాణుశిరఃప్రవర్తి నురుపక్షద్వంద్వశుక్లాభిరం
జకుఁడన్ సర్వదిగంతగామి నసకృత్సంసేవ్యమానుండ నై
ష్ఠికుఁడం గావున మత్సమానుఁ డగునే శీతాంశుఁ డం చెప్పుదుం
బక మిందుం బ్రహసించునట్లు సుజనుం బల్కుం దురాత్ముం డిలన్.


చ.

వలసినవంకలం గురియు వర్ష సమాగమమేఘ మేఁగి త
న్మలినత దాతయం దవగుణంబును సహ్యమె దృష్టి లేక ని
ర్మల మగుచోఁ దలంపఁగ శరద్ఘన మేటికి నట్ల యీగిమై
నెలయనివానివెల్లఁదన మేమి ప్రయోజన మర్థికోటికిన్.

అని మొదలగు పద్యములు గలవు. నీతిభూషణమునకు సంసృతమున మూల మేదో యిప్పటికి తెలియరాదు.

పురుషార్థసారము గణపతికి రుద్రదేవికిని మంత్రి యగు శివదేవయ్యచే రచిత మని “శివదేవయ్య పురుషార్థసారములో” నము నుదాహరణమువలన నూహింపఁదగియున్నది. అతఁడు పురుషార్థసారము గాక "శివదేవధీమణీ” యని మకుటము గలయొకశతకమును గూడ రచించినట్లు తోచుచున్నది. బాలబోధమునను లక్షణశిరోమణిలోను బురుషార్ధసారశివదేవశతకపద్యములు పెక్కు లుదాహృతము లయ్యె. శతకములో నుండి—

ఉ.

ప్రాణు నపానుఁ గూల్చి యలపాముఁ గదల్చి తదూర్ధ్వకీలితో
ద్యాణము నొత్తి మేను దృఢమై నిగుడం బిగియించి దృష్టులం
ఘోణము చేర్చి యాప్రణవఘోషణమున్ విని యందు మానస
క్షీణము సేసినం బవనసిద్ధుఁ డనా శివదేవధీమణీ.