పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13 ఆదర్శము

ఆమె ఒకానొకచోట - "అవసరమైనచో నేను పాలిచ్చి పెంచిన పసిపాపశిరము ముక్కముక్కలుగ చెక్కగల" ననెను. మన భాగవత మందలి పూతన యిట్టిదేకదా ! ఆమెకూడ శ్రీకృష్ణుని పాలిచ్చి చంప నుద్యుక్తురాలు కాలేదా ! ఇద్దరియందును కృతఘ్నత, ధర్మద్రోహమును సమానమే. ఆసురీప్రేమ పిచ్చియెత్తించ జూలియట్ అనేకవిధముల వాక్ఛలమున తన అంతరంగమును, యవ్వనలాలనయు రోమియో కెరిగించెను. అదే శ్రీరామునివంటివానిమ్రోల కావించెనేని రెండవ శూర్పణఖ అవతరించి యుండును. ఇద్దరికీ అనురాగ భేదము లవమైన కానరాదు. ప్రత్యాఖ్యానమున శూర్పణఖా విధిప్రేరితమున జూలియటూ విఫలమనోరథ లైరి. ఆమె సమరాగ్నిని ప్రజ్వలింపజేయ ఈమె ఆత్మఘాతకావించు కొనెను. సామాన్యకారణముచే ప్రేరితుడైన ఇయాగోచాతురి మానుషసీమను దాటి అన్న దాతయు ప్రభువునగు ఒథెతో హస్తములను స్త్రీహత్యాపామున పంకిల మొనర్చెను. ఇక మూడపరిచర్డిట్లనెను: -

                    since I cannot prove a lover .........I
                    am determined to prove a villain.
                    వలపుజనియింపజేయగ బడుగునౌట
                    అసురగుణముల తప్పకే నభ్యసింతు.

అతని యనంతరచర్య యీవాక్యమును స్థిరపరుచునట్లు కవి వాని నసురునిగా సృజించెను.