ఈ పుట ఆమోదించబడ్డది

బాబూ! నామాట విని యుండుము. ఈయొక్కటిమాత్రము వినుము. అటుపైని నీయిష్టమువచ్చిన యంశముపై B.N.R. పొగబండికూతతో నుపన్యసింతుము. రవంతసేపు బాబూ! శాంతింపుము. ఏమైన దనగా, ఈనడుమ నీడాక్టరు వీథివెంటఁ బోవుచుండంగా నొకయింటిలో నొకయాడుది యేడ్చుచున్నట్టు వినవచ్చెను. ఆతఁడు లోనికిఁ బోయి చూడఁగ నొకముసలి వితంతువు మంచమునొద్ద గూరుచుండి యేడ్చుచుండెను.

సీ. ‘‘అంతంత మొగములై యంతంతఱొమ్ములై
యంతంత యుదరంబు లైన వింత
యాకారములతోడ నేకుముక్కలవలెఁ
బలుచపల్చని వెలవెలలతోడ
నిదురమబ్బులతోడ నిట్టూర్పుబుసతోడ
నీరుపట్టినకాళ్ల బూరతోడ
మెల మెల్ల నెదురీఁత యలపుల సొలపుతో
గాజుకాయలబోలెఁ గానబడుచు

గుత్తుకుత్తను'......చున్న యొక్క చక్కని వ్యక్తి నచ్చటి మంచముపై గాంచెను

“What is the matter” అని వైద్యు డాముసలిదాని నడిగెను. ఏమియుఁ దెలియక యామె మరింత యేడ్చెను. అప్పడా వైద్యుఁడు చేయి చూచి నవమాసస్పూర్తి యైనట్లు ప్రత్యకముగఁ గానఁ బడుచున్న కడుపునకుఁ గుడివైపునఁ జెవిలో నొకగొట్టము పెట్టుకొని రెండునిముసములు నిదానించి "వెంటనే midwife ను బిల్పింపుము. మరేమియు భయము లేదు. ఇది మొదటి కానుపే కాదా! " యని యడిగెను. ఔను నాయనా! ఇది మొదటి కానుపే తరువాత నన్నియు గంగలోఁ గలిసినవి కావా యని తన కానుపులసంగతి చెప్పి మాట లేదు, చూపు లేదు, రక్షింపు మని యాముసలి దాతని కాళులపైనఁ బడి యేడ్చెను. ఒక్కజామునకు delivery అగు ననంగా కొందఱ కిట్టి fits వచ్చును. తొందరలేదు నేను బోయెదను. అని చెప్పి యాతండు పోయెను. హె హె హె ఎంత విచిత్రము! ఎంత విచిత్రము!

"అంత నవ్వెదవేల? ఇందుల నేమి విచిత్రమున్నది. నీ మొగము" అని నే నంటిని.

ఉండవోయి dunce చెప్పచుండఁగా నంత తొందరపడెద వెందులకు? ఆమంచము మీఁద నున్నదని చెప్పబడిన వ్యక్తి మగవాడు కాని యాడుది కాదు. వాడా ముసలిదాని కొడుకు. వాండూరిలోఁ బ్రచురించిన 'శ్రీరామజనన' నాటకములోఁ గౌసల్యపాత్రమును ధరించి, సొమ్ము రాకపోవుటచేత నాటకము మానివైచి చెడద్రాగి యుండుటచేత వేసము తీసివేసి కొనవలయునను జ్ఞానములేక యిట్లు చేరుసరికి మైకము హెచ్చగుటచేత నిశ్చే తనుఁడై మంచముపై బడిపోయెను. చూచితివా పాశ్చాత్యవైద్యులపస! ఇంగ్లండులోఁ గృతార్థుడై వచ్చిన వానిగతి యిది. ఈకీడును బాపుకొనుటకు వీడేమి చేసినాఁడో యెఱుఁగుదువా? కలకత్తాకు వ్రాసి 'కలియుగ ధన్వంతరి" యను బిరుదమును పదుమూఁడు రూపాయలకు వి.పి. గా దెప్పించినాఁడు. భగవదవతారమని చెప్పఁబడి ధన్వంతరి నెట్టవానిని జేసినారు! మతియున్న వాడో, మతిలేనివాఁడో యెఱుఁగని మతిలేని వానిని జేసినారు. గొంగళి పురుగునకుఁ గుక్కకుఁ గ్రోఁతికి స్వభావసిద్దముగఁ దెలిసిన