ఈ పుట ఆమోదించబడ్డది


ద్వి.

సజ్జనశృంగార సత్యగంభీర
యిజ్జగధార యీశ్వరాకార
మంగళగుణధామ మహిమాభిరామ
లింగాభిరూప యభంగ ప్రతాప
నిర్జితాహంకార నిఖిలోపకార
దుర్జనదూర విధూతసంసార
కారుణ్యపాత్ర యకల్మషగాత్ర
వీరవ్రతాచార్య విపరీతశార్య
యంచితాగణ్య నిరంతరపుణ్య
సంచితసుఖీలీల శరణవిలోల
సన్నుతకీర్తి సాక్షాద్రుద్రమూర్తి
కిన్నర బ్రహ్మయ్య కృప సేయుమయ్య.

బ్రహ్మయ్య బసవేశ్వరునకు మ్రొక్కి శంకరభగవాను స్మరించి "హే" యని యుచ్చై స్స్వరమునఁ బలుక సృష్టి యథాక్రమము నొందెను.

ఒక్కగొర్రె కారణముగ గోళములన్నియు వ్యత్యస్తము లైనవే. ఆహా! ప్రపంచమున కపాయము తేఁజాలనంత యధమమై వస్తువున్నదా! సృష్టిలో జరిగిన-జరుగుచున్న మహాందోళనము లన్నిటికిఁ గారణము లరసి చూడ నత్యల్పములై యత్యధమములై కానఁబడునే. పదునెనిమి దక్షౌహిణుల ప్రాణములు తీసిన భారతయుద్దమునకుఁ బ్రథమకారణము పాంచాలీ పరిహాసమేకాదా! గూనిదానికుట్రచేతనే కాదా కుంభకర్ణుఁడు రావణుఁడు చచ్చినది. అయిదు ఖండములందుగూడ నంటుకొనిన మొన్న మొన్నటి మహాహవము ప్రపంచపటమునఁ బల్గేరు కాయయంత ప్రదేశము కొఱకే కాదా?

ఈసంగతికేమి-దేవాలయమునొద్ద మూర్చ నొందినవా రెల్ల లేచిరి. వారితోపాటు గొర్రెకొఱకు ప్రాణముల బాసిన విటుడు కూడ లేచెను. ఇప్పడాతండు విటుడా? మూర్ఛావసరమున బ్రహ్మముఖమునం బంచాకరీమంత్ర ముపదేశ మందిన యాత డింక విటుఁ డగునా? అతఁడు బ్రహ్మయ్యకు సాష్ట్రాంగపడఁగ, నాతని నతఁడు లేవనెత్తి 'నీకు నాకు సర్వ లోకమునకు గురుఁ డీ బసవేశ్వరస్వామి. ఈయనకు మ్రొక్కు మని యాతనికి మ్రొక్కికొంచెను. చెనఁటియైన కులటచేఁ జేబ్రేటుదిన్న యాతని గుండెపై నిప్పడు శ్రీకంఠమూర్తి ప్రకాశించుచున్నాఁడు. ఆతని హృదయోపరిభాగమున వేశ్యయైదువేళ్లట్లం టెనో యాతని హృదయాంతర్భాగమునం బంచాక్షరియట్టంటెను. పైపైనున్న దశాశ్వతము లోలోనిదే శాశ్వతము కాదా? బసవేశ్వరస్శామిని బ్రహ్మయ్యను జయజయ ధ్వానములతో నూరేఁగించి రాజు వారికి సాష్టాంగపడి సెలవుతీసికొని కోటకుఁ బోయెను.

చిత్రమైన యీ గాథ పాల్కురికి సోమనాథకవి ప్రణీతమైన బసవపురాణములోనిది. దానిలో మహావిచిత్రములైన గాథ లనేకమున్నవి. ఈగ్రంథము నూతనముగ దేశోద్ధారక నాగేశ్వరరావుగారిచే నచ్చొత్తింపఁబడి ప్రకటింపఁబడినది. మహేశ్వరభక్తులైన మహామహుల విచిత్రగాథలన్నియుఁ జదివి యాంధ్రసోదరులు తరింతురుగాక!

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.