ఈ పుట ఆమోదించబడ్డది


దత్తకైవల్యయుదాత్త సద్భక్త
విత్తేశ శ్రీగురవే నమో యనుచు
నమితపరంజ్యోతి రాకారదివ్య
విమలాంగ శ్రీగురవే నమో యనుచు
స్థిరతరసృష్టిస్థితిలయప్రపంచ
విరహిత శ్రీగురవే నమో యనుచు
సకలనిష్కళచరాచర రూపవిగత
వికృతాంగ శ్రీగురవే నమో యనుచు
నాద్యంతరహిత నిత్యామలతేజ
విద్యాత్మ శ్రీగురవే నమో యనుచు
నధ్వషట్కాతీత యవిపాతకౌఘ
విధ్వంస శ్రీగురవే నమో యనుచు
మోక్షార్థిరక్షణ దక్షకటాక
వీక్షణ శ్రీగురవే నమో యనుచు
నజ్ఞానతిమిరసంహారార్థదత్త
విజ్ఞాన శ్రీగురవే నమో యనుచు
ధన్యాత్మశిష్యమస్తకకృపాహస్త
విన్యాస శ్రీగురవే నమో యనుచు
నఘహరణార్ధ శిష్యజనోపభుక్త
విఘసన శ్రీగురవే నమో యనుచు
నశ్రాంతభక్తజనాత్మాంబుజాత
విశ్రాంత శ్రీగురవే నమో యనుచు
ననఘగురు ప్రసాదామృతహృదయ
వినివాస శ్రీగురవే నమో యనుచు

చెన్నబసవఁ డేమహామహుని నోరార మనసార స్తుతియించెనో యాబసవేశ్వరుఁడే మన కిన్నర బ్రహ్మయ్యకు సాక్షాత్కరించెను. అట్టు ప్రత్యక్షమైన బసవేశ్వరునిఁ జూచి హరహరహర మహాదేవ శంభూ' యని సాష్ట్రాంగదండప్రణామ మాచరించెను. బసవేశ్వరుఁడు కూడ నాభక్తునకుఁ జాఁగిమ్రొక్కి, యనునయించి యతిథిపూజ నాచరించి "సవిశేషతత్త్వా నుభవ భవ్యగోష్టి సలుపుచుఁ దన నిలయమునకుఁ దీసికొనిపోయి యథార్హముగ గౌరవిం చెను.

ఆపురముననున్న త్రిపురాంతక దేవాలయమునకు మహాదేవదర్శనార్థమై బ్రహ్మయ్య వెడలెను. దేవాలయమునెదుట నొకచిత్రము జరుగుచున్నది. ఒక గొఱ్ఱెమెడకుఁ ద్రాడు కట్టి యాత్రాటిని జేతఁబట్టుకొని యొకఁడు దానిని లాగుకొనిపోవుచుండెను. తానుంచు కొన్న వారాంగనకొఱకు దానిని బలి నిచ్చుటకై కొనిపోవుచుండెను. ఉంచుకొన్నదానికై దానిని వధించునెడల నామె యారోగ్యవతియై, యైశ్వర్యవతియై, తనయం దనురాగవతియై యుండునని యాతండు దాని నుత్సాహమున నీడ్చుకొనిపోవుచున్నాడు. కాని యాగొఱ్ఱె