6. వీరశైవులు
సాక్షి సంఘంలో మతవిషయక ఉపన్యాసాలు దాదాపుగా అన్నీ విష్ణుప్రశంసా ప్రధానాలుగా వుండడం గమనించదగినది. ఈసారి ఒక వీరశైవుడు వచ్చి సాక్షి సంఘసభలో ప్రసంగించాడు. అద్వైతి అయిన జంఘాలశాస్త్రి శివ సంబంధమైన వీరశైవగాధను ఏదీ చెప్పకపోవడానికి తనకు కారణం తెలియదంటూ-అది క్షమింపదగని ఉపేక్ష అన్నాడు. కనక-ఒక శివభక్తుని కథ చెప్పడానికి ఉపక్రమించి-పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణం నుండి కిన్నెర బ్రహ్మయ్య కథ ప్రారంభించాడు.
బ్రహ్మయ్య మహాశివభక్తుడు. ఒకసారి అతను శివనామం గానం చేసుకుంటూ, బసవేశ్వరుడి దర్శనం కోరి బయలుదేరాడు. అతను సంగమేశ్వరం చేరడానికి ముందే బసవేశ్వరుడెదురువచ్చి మన్నించి తన యింటికి తీసుకువెళ్లాడు.
అదే వూళ్లో వున్న త్రిపురాంతక దేవాలయానికి దర్శనం కోసం బ్రహ్మయ్య వెళ్లాడు. అక్కడ బాటవెంట ఒక ’గొర్రె’ మెడకు తాడువేసి లాగుతూ ఒక విటుడు తన ఉంపుడుగత్తె ఆరోగ్యం కోసం బలి ఇవ్వడానికి తీసుకు పోతున్నాడు. అది మెడతాడు తెంపుకుని బ్రహ్మయ్య దగ్గరకు వచ్చి నిలబడింది. కరుణాశీలి అయిన బ్రహ్మయ్య ఆ విటుడికి వెయ్యిమాడ లిచ్చి ఆగొర్రెను కొన్నాడు. దానికి విభూతి రక్ష పెట్టి పంచాక్షరి దాని చెవిలో ఊదాడు.
విటుడు మరో గొర్రెను తీసుకొని వేశ్య ఇంటికివెళ్లి, గొర్రెను మార్చినందుకు తాపులు, తిట్లుతిని, బ్రహ్మయ్య దగ్గరకు వచ్చి తన గొర్రెను తిరిగి ఇమ్మన్నాడు. ఘర్షణ జరిగింది. విటుడు స్పృహ కోల్పోయి మరణించాడు. ఈవార్త చిలవలు పలవలు అల్లుకొని రాజు దగ్గరకు వెళ్లింది. విచారణకు వచ్చిన రాజుకు, త్రిపురాంతకదేవుడి సాక్ష్యంతో కళ్లు విడ్డాయి. మాయ నుంచి బయటపడి బతికిన విటుడు మహాశివభక్తుడయ్యాడు. బసవేశ్వరుడు బ్రహ్మయ్యను ఎంతోమన్నించాడు.
జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.
నాయనలారా! ఒక శివభక్తుఁడు మనసభలో నేఁడుపన్యసించును. అతఁడు లింగధారి.