ఈ పుట ఆమోదించబడ్డది

ప్రమాదమున నైనను రామనామ ముచ్చరించుట లేదు. అంతటితో నాగినఁ గొంతమంచిదే "పనికిమాలిన ప్రపంచము, ఎంతసేపు పుణ్యాత్ములకే చిక్కులు. భక్తులకే బాధలు. ఏమిలోకము? ఏమి దేవుండు? ఉన్నాండో లేఁడో కూడను ఉండిచేయుచున్న సౌభాగ్య మిదియే కాదా? కరుణాళుఁడట! ఆపద్రక్షకుడట. చెప్పిననానిని, వినినవానిని గూడఁ జెప్పుదీసి కొని తన్నవలయును. ఏదో సుఖముగా జీవనము జరుగుటకేకదా యిన్నిపూజ లొనర్చితిని. నేఁ జేసిన పూజలన్నియు బుగ్గియై పోయినవా? ఎన్ని దివ్యదేశములు సేవించితిని! ఎంతడబ్బు తగులఁ బెట్టితిని! ఇచ్చిన యావులు, చేసిన సత్కారములు, పెట్టిన నైవేద్యము లన్నియు దిగమ్రింగి, తీర పని వచ్చినప్పడు మొండిచేయి చూపుటా? కనబడినాడుకాఁడు కాని యీడ్చి సాగదీసి....... ' యని యయ్యవారు పలుకుచున్నాఁడు. నాస్తికతయింత కంటె సహస్రగుణములు మంచిది కాదా? పశుత్వమే యింతకంటెఁ బ్రశస్తతరము కాదా? శ్రీరామ కృష్ణపరమహంసగారిట్టి వారిని జిలుకతోఁ బోల్చినారు. దోరజామిపండు కడుపునిండం దిని, కొబ్బెరచిప్పలో నీరు ద్రావి, పంజరమున నడ్డుగనున్న యినుపశలాక పైఁ గూరుచుండి 'అఖిలజగన్నాయకా! అపన్నివారకా! జగచ్చక్రవర్తీ జగన్నాథమూర్తీ' యని ముద్దులొలుకఁ బలుకును. పంజరమునొద్దకుఁ బిల్లి వచ్చి దానితోఁక గ్రహింపఁ బోవఁగ జగచ్చక్రవర్తి లేఁడు, జగన్నాథమూర్తి లేఁడు. కేరుకేరున నొక్కపెట్టునఁ గూయుచు విలవిల కొట్టుకొనును. నోటితుంపరకు మనస్సున కెంత సంబంధ మున్నదో, యిట్టి వారి హరినామస్మరణమునకు నాత్మకు నంత సంబంధ మున్నది. వీరిట్లొనర్చు హరినామస్మరణము, దేవతార్చనము మొదలగునవి భక్తితో సంబంధించిన వేమాత్రము గావు. ఆడుపిల్లలు కాగితాల యిండ్లు కట్టుకొని యాడుకొన్న మగండు పెండ్లామాటలకు శృంగారరసముతో నెంత సంబంధ మున్నదో, వీరి బొమ్మలదుకాణమునకు భక్తిరసముతో నంత సంబంధ మున్నది. ఇవి కర్మముతో సంబంధించినవి మాత్రమే యగును. సుఖము సిద్దించినయెడల నొడలు తెలియక తెయితక్కలాడుట, కష్టములు సంభవించినయెడల నెత్తి నోరు కొట్టుకొని యేడ్చుట భక్తుని లకణమా? భక్తుఁడు సుఖదుఃఖముఁడు కాఁడా?

శ్లో.

అద్వేష్ట్వా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ,
నిర్మమో నిరహంకారస్సమదుఃఖసుఖః క్షమీ.
సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః,
మయ్యర్పితమనోబుద్ది యో మేభక్తస్సమే ప్రియః.
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి,
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్సమే ప్రియః.
సమశ్శత్రౌ చమిత్రే చతథా మానావమానయోః,
శీతోష్ణసుఖదుఃఖేషు సమన్సంగవివర్జితః.
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్,
అనికేతః స్థిరమితిర్భక్తిమాన్ మే ప్రియో నరః.

ఈశ్లోకములందు భక్తునిలక్షణములు కొన్ని శ్రీకృష్ణభగవానులు సెలవిచ్చియు న్నారు. సుఖదుఃఖసమత్వము, శత్రుమిత్రభేదశూన్యత, స్తుతినిందాతుల్యత్వము, శుభాశుభ పరిత్యాగము, సంతతసంతుష్టచిత్తత మొదలగునవి భక్తుని లక్షణములని సెలవిచ్చినారు. కాని, యట్టిభక్తి యెట్లు కలుగును?

శ్లో.

జన్మాంతరసహస్రేషు తపోజ్ఞానసమాధిభిః,
నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తిః ప్రజాయతే.