ఈ పుట ఆమోదించబడ్డది

మా మాట

మంచి రచనలు అందించాలనీ,

మంచి అభిరుచి పెంపొందించాలనీ,

పాఠకులు కలకాలం తమ సొంత గ్రంథాలయంలో మంచి పుస్తకాలు పెట్టుకొని పదే పదే వాటిని చదువుకోవడానికి దోహదం చెయ్యాలనీ - మా చిరకాల వాంచితం.

ఈ ప్రయత్నంలో మా సోదర సంస్థ ' న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్ ' యిప్పటివరకు చాలా విజ్ఞాన దాయకమైన పుస్తకాలను, ఉత్తమ సాహిత్య గ్రంథాలను ప్రచురించి, చేతనైనంత కృషి చేస్తూందని మీకు తెలుసు.

ఇప్పుడు మా నూతన సంస్థ ' అభినందన పబ్లిషర్స్ ' ఒక సాహసం చేస్తోంది. అయితే, ఈ సాహసం ఆనందకరమైనది. ఒకరకంగా గర్వకారణమైనది. అదే, ' కవిశేఖర ' పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన ' సాక్షి ' వ్యాసాలను ప్రచురించి - అభిమాన పాఠకులకు అందించడం.

కొందరు - కథలు వ్రాసి, గొప్ప కథకు లనిపించుకున్న వారున్నారు. కొందరు నవలను వ్రాసి గుర్తింపు, గౌరవం పొందిన వారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణకెక్కిన వారున్నారు. కాని - ' వ్యాసం ' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న మహా రచయిత బహుశా పానుగంటి వారొక్కరే. నాటకం వ్రాసి గురజాడవారు గిరీశం పాత్రను చిరంజీవినిచేస్తే, పానుగంటివారు వ్యాసాలను ఉపన్యాసాలుగా, ఉపన్యాసాలను వ్యాసాలుగా జలకాలాడించి - జంఘాలశాస్త్రి పాత్రను చిరంజీవిని చేశారు. ఈ వ్యాసాలలో పానుగంటి వారి శైలి, విషయ విన్యాసం చూస్తుంటే, చురకత్తి కొసను మల్లెదండ వ్రేలాడ దీసి నట్టుంటుంది. 1913లో కొంతకాలం, 1920లో కొంతకాలం ' సాక్షి ' వ్యాసాలను ఆయన రచించారు. ఎందరో అసంఖ్యాక పాఠకుల్ని ఆకర్షించారు. అలరించారు. పానుగంటే సాక్షి, సాక్షే పానుగంటి అనిపించారు.

తొలుత ఈ వ్యాసాలను పిఠాపురం రాజావారు ముద్రించి ప్రచారం చేశారు. ఆ తరువాత మద్రాసులోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారు ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఈ విషయాలు జరిగి దాదాపు నలబై సంవత్సరాలు గడిచాయి. (వావిళ్లవారికి సంబంధించినంతవరకు)

ప్రస్తుతం ఆ ఆరు సంపుటాలు ' సాక్షి ' వ్యాసాలను - అక్షరం పొల్లుపోకుండా మొత్తం - మూడు సంపుటాలుగా పాఠకులకు అందించగలిగే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాం.

1920 లెక్కవేసుకున్నా, ఈ వ్యాసాల రచన జరిగి ఇప్పటికి 70 ఏళ్లు కావస్తోంది. వీటి భాష గ్రాంథికం. విషయాలు ఎంత ఆసక్తి కరమైనవైనా, ఎంత హాస్యరస ప్రధానంగా వున్నా, ఈ నాటి పాఠకులకు ఈ ' సాక్షి ' ని చేరువ చెయ్యాలంటే, వ్యావహారిక భాషలో, ప్రతి వ్యాసం సారాంశం ముందు ' టూకీ ' గా అందిస్తే బాగుంటుందని తోచింది. ఈ మా