35. ఆంధ్రసాహిత్యపరిషదేకాదశ వార్షికోత్సవ అధ్యక్షోపన్యాసము
ఆంధ్రదేశ సాహిత్య చరిత్రలో, గ్రాంథిక భాషా పరిరక్షణ కోసం 1911లో ఆంధ్రసాహిత్య పరిషత్తు అవతరించింది. ఈ పరిషత్తు స్థాపక, వ్యాపకులలో పిఠాపురం మహారాజా సుర్యారాయ మహీపతి, జయంతి రామయ్య పంతులు ప్రముఖులు.
ఈ పరిషత్తు 11వ వార్షికోత్సవం దుందుభినామ సంవత్సర భాద్రపద శుద్ద ఏకాదశి రోజున పిఠాపురంలో జరిగింది. ఈ సభకు పానుగంట లక్ష్మీనరసింహారావు గారు అధ్యక్షత వహించి చేసిన ఉపన్యాస పాఠం ఇది.
ఆయన ముందుగా పిఠాపురం విశిష్టతను, ఆ సభ జరుగుతున్న మహారాజు మందిరం విశిష్టతను ప్రశంసించారు. అప్పటికి వున్న ఆంధ్ర భాషా స్థితిని-నాటకీయంగా-ఎదుట దృశ్యం కనిపిస్తునట్టు వర్ణించారు. ఎన్నెన్ని రకాల సాహిత్యం, ఎన్నెన్ని రకాల కవుల సందడి, దేశాన్ని క్రమ్ముకొనివుందో విశదం చేశారు. ఆంధ్రదేశ ప్రజలలో నూటకి ఇరవై మందికి మించి ఆంధ్రభాషా జ్ఞానం లేక పోవచ్చుగాని-అదే చాలునన్నారు.
ఆంధ్రులైన వారు ప్రతి వ్యక్తీ, ఆంధ్ర గ్రంథాల్ని కొనాలని విన్నవిం చారు. ప్రజాపోషణ గ్రంథకర్తలకు అవసరమన్నారు. పుస్తకాలలో మంచివాటిని గౌరవించాలనీ, చెడ్డవాటిని బహిష్కరించాలనీ, సూచించారు. తెలుగులో ఉత్తమ సాహిత్య విమర్శ' అభివృద్ది కావడానికి పరిషత్తు కృషి చెయ్యాలన్నారు. ఒక్క సాహిత్య సంబంధ గ్రంథాలేకాక, అనేక ఇతర శాస్త్ర గ్రంథాలు కూడా తెలుగులోకి అనువాదం కావాలనీ, ఛందస్సులో కవిత్వ రచనే కాక, వచనసాహిత్యం విరివిగా పుట్టి భాషను అభివృద్ది చేయాలనీ, కవుల చరిత్రల్నీ, చిత్రపటాల్నీ పరిషత్తు సేకరించాలనీ, ముఖ్యంగా వివిధ వచనశైలీ నిర్మాణం రచయితల వల్ల జరగాలనీ కోరారు. ఇందుకు ప్రజలు, పరిషత్తుకి ఆర్థికంగా చేయూత ఇవ్వాలన్నారు. అర్హులైన పండితులకు, పరిషత్తు బిరుదులివ్వాలని సూచించారు. కొంత సొమ్ము కేటాయించి పేదకవులను ఆదుకొనే యత్నం చేయాలన్నారు. ఏటా వార్షికోత్సవ నివేదికల కంటె ముఖ్యంగా పరిషత్తు, నిర్మాణాత్మకమైన కృషి గ్రంథ రచన రూపంలో చూపించాలన్నారు.