ఈ పుట ఆమోదించబడ్డది

31. దొరకిన యుపన్యాసము

కసారి పానుగంటివారు తణుకు నుంచి పిఠాపురం వెడుతూ, నిడదవోలులో రైలులో ఎక్కారు. రైలు కదిలిన కొంతసేపటికి, బెర్తును ఉత్తరీయంతో దులిపి, నడుం వాలుద్దామనుకుంటూండగా ఒక కాగితాల బొత్తి కనిపించింది. అది ఒక మహిళ వ్రాసిన ప్రసంగ పాఠం. ఆ మహిళ, ఆ ప్రసంగాన్ని ప్రకటించడమే ఉత్తమమని ఎంచి, దానికొక ప్రతిని రాసి - భారతి పత్రికాధిపతికి పంపాడు. సు.స. అనే పొడి అక్షరాలో వున్న ఆ ప్రసంగ పాఠం సారాంశం ఇది:-

పురుషుడు మొట్టమొదటి నుంచి స్త్రీ అభివృద్దికి ఆటంకాలు కల్పిస్తూనే వున్నాడు. కొద్దికాలం క్రితం వరకూ కూడా మగవాడు ఆడదానిని వీధి గుమ్మం వరకు కూడా రానివ్వలేదు. నారీ సంఘం అంతా ఈ అనారీ సంఘాన్ని ఎందుకు అణగద్రొక్కకూడదు? ఆడది మగవాణ్ణి అనుకరిస్తోందని మగవాడి వుద్దేశం. నిజానికి స్త్రీ పురుషుణ్ణి అనుకరించడమంత రోత మరొకటి లేదు. ఆ మాటకొస్తే పురుషుడే నాటకాలలో స్త్రీవేషం వేసి అనుకరిస్తూ స్త్రీ జాతినే అవమానిస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా స్త్రీ సహజమైన హావభావాలను పురుషుడు అనుకరించలేడు. చేసే, ఆంగికమైన అనుకరణ అతనిలో, “స్త్రీత్వ సౌకుమార్యాన్ని తీసుకురాకపోగా, ఉన్న పురుషత్వ లక్షణాలను దూరం చేస్తోంది. ఎందరినో ఆక్షేపించే జంఘాలశాస్త్రి మగవాడు ఆడవేషం వెయ్యడాన్ని ఎందుకాక్షేపించాడు. కేవలం, తను మగవాడు గనుకనే, మగతత్త్వం, ఆడతత్త్వం మౌలికంగా భిన్నమైనవి. పురుషుడు స్త్రీని అనుకరించడం మానాలి. ఆంధ్రదేశంలో వున్న నాటక సంఘాధిపతులకి ఒక ఆజ్ఞాపత్రం పంపాలి. ఏమనంటే మగవాళ్లు ఆడవేషం వెయ్యరాదు. స్త్రీలకే పాత్రలిచ్చి పోషించాలి అని. అందుకు ఒప్పని స్రీ వేషాలేసే భర్తల్ని, వారి భార్యలు త్యజించడానికి సంశయించకూడదు. దీనిని ప్రచురణకు పంపుతూనే, దాని జాబు వ్రాస్తామని పానుగంటివారు భారతీ పాఠకులకు ఒక లేఖ కూడా జత చేశాడు.

శ్రీ భారతీ పత్రికాధిపతీ! నమస్కారములు.

ఈనడుమ నా సాంతపనిమీఁద నేను దణుకు వెళ్లియచ్చట నొక్కదిన ముండి తిరుగఁ