ఈ పుట ఆమోదించబడ్డది

కలుగునో యని యితరులుగూడ భావించి చూచుచుండెడివారు. ఈమె నెత్తుకొన్న నేమి విశేషమో, యీమెకు పాలిచ్చిన నేమివిశేషమో, తల దువ్విన నేమివిశేషమో యని యా యూరిప్రభుకాంతలు, బ్రాహ్మణకాంతలు తలఁచుచు, సమస్తోపచారము లీపిల్లకుఁ జేయు చుండిరి. ఎవ్వరికైన జబ్బుగా నున్నయెడల నీమెను వారింటికిఁదీసికొనిపోవుచుండుదురు. ఈమెయున్న చోట సుఖము, నారోగ్యము, నైశ్వర్యము, సంపత్తి యుండక తప్ప వని యందఱనమ్మకమైయుండెను.

కాని యీమె బాల్యముననే కొన్నియద్బుత గుణములు వెల్లడించుచుండెను. పిల్లలు సాధారణముగాఁబప్పని, పండ్లని, భక్యములని వలపులాడిపోవుదురు కదా, యీమె యెదుట నెన్నిమధురపదార్ధము లుంచినను వారి నేవియు ముట్టక వ్యాసపీఠమున నున్న భగవద్గీతను చేతఁ బుచ్చుకొని యక్కడఁ గూరుచుండెడిది. బొమ్మలని, గడియారములని, తోపుడుబం డ్డని ఎన్నివింతవస్తువు లెదుట నుంచినను వాని నేవియు స్పృశింపక వీణయొద్దకుఁ బ్రాకి తీగలను గదల్చి కలకల లాడుచుండెడిది. ముత్యాలసరములని, పచ్చలహారము లని, బంగారు కంఠమాలలని-ఎన్నియెన్ని వస్తువు లామెయెదుట నుంచినను వానినిఁ తప్పించు కొని తల్లిగారి దేవతార్చనలోని జపమాల పట్టుకొని ప్రాగి వచ్చుచుండెడిది. ఈగుణమువలన నీమె పరుల కానందము, సుఖము, సంపద కలుగఁజేయువారే కాని స్వలాభము నపేక్షించి యేపనియైనను జేయువారు కారని యప్పడే యంద ఆనుకొనిరి. భక్తురాలగునని కొందఱు, సన్యాసివియగు నని కొందఱు, ఎవరికిఁ దోఁచినట్లు వారను కొనుచుండిరి. జనకమహారాజు చక్రవర్తియు, సన్యాసియు నేక కాలమందే యైనట్లు చక్రవర్తినియు, సన్న్యాసియుగూడ నేకకాల మందే కాగూడదా? యని కొందఱనిరి. ఇంత యసామాన్యప్రకృతు లద్దాయుర్వ్య క్తులే యవియు, ఋణశేషముఁ దీర్చుకొనుటకు వచ్చి తుడిచిపెట్టఁదగినంత తుడిచిపెట్టి, తుఱ్ఱున నెగిరిపోవు ననియు మఱికొంద ఆనిరి. ఎవరినాలుక కద్దేమున్నది? అన్ని స్వాతం త్ర్యము లంతరించినను రాజకీయవిషయే తరతంత్రములందు మన కింక నాలాపస్వాతం త్ర్యము మిగిలియున్నది కాదా?

ఇంటియొద్దనే యామెకు విద్యాభ్యాస మైనది. అతిశీఘ్రముగ వ్రాయను, చదువను నేర్చుకొనెను. ఆంగ్లేయభాషయుఁగూడఁ గొంత నింటియొద్దనే నేర్చుకొనెను. అట్టియట్టె వయస్సు హెచ్చుచున్న కొలఁది మొగములో లక్ష్మీకళ హెచ్చుచున్నది. శరీరము పుష్టియైన కొలఁదిఁ గంటిలోని శాసనతేజము తీక్షమగుచున్నది. చిత్తమునకు వికాసము కలిగిన కొలఁది నావరించిన పవిత్రత హెచ్చగుచున్నది.

ఒక మహాసంపన్నకుటుంబములోని బాలు డామెస్వరూప స్వభావాదులను విని వరించి, వివాహము చేసికొనెను. ఆమె పుట్టినింటి వారికంటె నత్తింటివారికి హెచ్చుసంపన్నతయు, రాబడియు నుండెను. మహాదృష్టవంతురా లని జనవాక్యము విజృంభించెను. అది వట్టి తెలివితక్కువమాట. ఈమెవలన నామహాసంపన్నుడే మహాదృష్టవంతుఁ డైనాఁడను మాట బుద్దికలిగిన మాట. ఆయన కప్పటికున్న కష్టము విచారము లీమెవలనఁగాని శాంతింప వని భగవంతుడెఱిఁగి యీమెను వారియింట సంరక్షకదేవతగ నుంచినాడు. పూజకొలఁది పురుషుఁ డన్నసామెత యిచ్చట వర్తింపదు. ఆతఁడు చేసికొన్న పూజకొలఁదియే యీపొలతి లభించిన దనియనుకొనుట సరిగా నుండును. ఇక నామహారాజున కేమిలోపము.