ఇప్పడన్నియుఁ గళలే. పంట యొకకళ. కల్లుగీత యొకకళ. దొంగ తన మొకకళ. క్షౌర మొకకళ. తుదకు “Murder is a fine art” (జీవహత్య యొక్క లలితకళ) వఱకు వచ్చినది.
కవీ! నీకొక్క శబ్దమయిన నీయను. కవిత్వముఁ జెప్పగలవా? ఏమనుచున్నావు? గట్టిగఁ జెప్పము? నావలనఁ గాదనుచున్నావా? అటులైన దూరముగఁ గూరుచుండుము. గాయకుడా! నీ కొక్క యక్షరమున నీయను. పాడఁగలవా? ఏమనుచున్నావు? అద్దేఅద్దే. అవలీలగ బాడంగల ననుచున్నావా? సరే పాడుదువుగాని ఒక్క నిముసముండుము అదేమి? అదేమి?
సీ. మెఱుఁగుఁగుండలముల మిసమిసల్ గండభా
గములపై నట్టిట్టు గంతులిడగ
రంగారఁగట్టిన బంగారుపుట్టంబు
చిఱుబొజ్జనుండి కొంచెముగ జార
బవనపూరణమున జవుజవ్వుమని లేఁత
చెక్కులు బూరెలై పూరటిల్ల
నిగనిగల్ గలగుజ్జ సిగనున్న శిఖిపింఛ
మొయ్యారమునఁ దలయూపుచుండ
నుత్తమోత్తమజన్మమై యొప్పమురళి
నధరమునఁబూనిజల్టల్లు మనఁగజగతి
గానమును జేయు నీలాల కాంతిరాశి
గొల్లభామలబంగారు కొంగు మూటు!
ఆహాహా! ఏమిగానము తీఁగలు పుష్పించుచున్నవి. రాలు ద్రవించుచున్నవి. ముక్కులు తెఱచుకొని పక్షులు విని పరవశము లగుచున్నవి. పశువులు మోరలెత్తి గానామ్పత మును ద్రావి సోలుచున్నవి. కదలిన యెడల నేమగునోయని గాలి స్తంభించియున్నది. లక్షలకొలది యింద్రధనుస్సులనుండి సుధావర్షము దేవతల పుష్పవృష్టితో గురియుచున్నది. నాయనా! నందకుమారా! నవనీతచోరా! యని కేకలు పెట్టి పెద్దపెట్టున నేడ్చుచు నా పిచ్చివాఁడు క్రిందపడినాఁడు.......
ఓహో! నాయనలారా! పిచ్చివాడు మనల నెట్టి పవిత్రసన్నివేశమున విడిచి తాను విస్మితుడైనాడు. ఆహాహా ఏమియేడు పేడ్చినాడు? ఇట్టియవసరమున నేడ్వలేనివాఁడీశ్వధ ద్రోహి. శారదాగానము కంటెఁ దుంబురునారదాది వైణికులగానము కంటె బిచ్చివానియేడ్పు నాతండ్రీ! నీ కెక్కువగాఁ బ్రీతికరముగా నుండును గదా! వెఱ్ఱబాగులవాని భక్తిరోదన మొక్కటి, తల్లిచావుపిల్లకు ద్రోదన మొక్కటి, పదునాల్గు భువనములను బునాదులతో గూడ నల్లలాడింప సమర్ధములైనవి. కృష్ణా! ఆపదుద్దారకా! రక్షింపుము.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.