షా- మరియొకరి తప్పయిన యెడల నట్టు చేయదగినదే. కాని పాదుషానైనా నాయింటిలోని జంకుగాదా? నేను ఫిర్యాదినా? నా దాసులు సాక్షులా? ఇది చాలతప్ప గాదా? అదిగాక యీతంత్రమున నాకుఁ గావలసిన వారందరు చిక్కుకొని యున్నారు, నాప్రతిష్ట నాప్రాణము, నామానము పోదగిన తంత్రము సిద్దించినది.
కిన్నె:- ఇది తంత్రమేకాని, సత్యముకాదని మీరొప్పకొందురా?
షా:- ఒప్పకొంటని.
కిన్నె:- ఒప్పకొంటివా? సంతోషమే. అటులైన న న్నేమి చేయుమంటివి.
షా:- నీయిష్టము వచ్చినచోటికి నీవు బొమ్ము.
కిన్నె- పాదుషా! నేను నిర్దోషినైన నీ భార్యనని నీవు పలికితివి. నా కంతియే చాలును. నేను నీ సెలవు ప్రకారము నాయిష్టము వచ్చినచోటికిఁ బోవుదును. నాకు సెలవా? అల్లాహో అగ్బర్ అల్లాహో అగ్బర్ అల్లాహో అగ్బర్ (పాదుషాకు సాష్ట్రాంగపడి) బిస్ మిల్లా! బిన్ మిల్లా (యని తల బళ్లుమని నేల గొట్టుకొనినది.)
షా:- ఆ! ఆ! ఎంత ప్రమాదము. యాకుతీ! ఆమెతలకు దెబ్బ తగిలినది. ఎట్టు రక్తము ప్రవహించుచున్నదో, మంచముమీఁద నిమ్మళముగఁ బరుండ బెట్టెదము. రవంత సాయము చేయుదువా?
యా:- పాదుషా సర్కార్! ఆమె పార్సా (మహాపతివ్రత) ఆమెను నే నంటుదునా?
షా:- అటులైనఁ బరుగెత్తుకొనిపోయి దాసులను హుజూర్ తబీమ్ను (వైద్యుడు) బిలుచుకొని రా?
(యాకుతి బోవును.)
షా- అల్లా అల్లా ఎంతసని జరిగినది. ముసలితనమున వీర్యవృద్దికొరకు హల్వాలను మ్రింగి నల్లమందు మొదలగు నిషాపదార్ధముల నెక్కించి, ఉద్రేకమును బుట్టించు కథలను విని, ప్రదర్శనములను గాంచి, కనబడి కాంతావాంఛను తీర్చికొనుటకై యీ పడుచు బంగారుబొమ్మ బ్రదుకు భ్రష్టమొనర్చితిని. అయ్యయ్యో! ప్యారీ! వెళ్లిపోయితివా! (మొగమున గుడ్డవైచుకొని హా! యని యఱచుచు నావలికిఁ బోయెను.)
ఆతని హాహాకారముతో మేల్కాంచితిని, ఇక్కడికి స్వప్నము సరి.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.