ఈ పుట ఆమోదించబడ్డది

గాసంత తటపటాయించును. పవిత్రదినములం దెట్టిపాపశీలుని మనస్సునందైన రవంత పశ్చాత్తాపము తాత్కాలికముగనైనఁ గలుగక మానదు. అట్టిపవిత్రాంతఃకరణములతో జనులెల్లరు మనయుత్సవముల బాల్గొందురు. వారితో మన మాయుత్సవములందు వివిధ భక్ష్యభోజ్యాదులతో నసాధారణమైన విందారగింతుము. పెద్దలేర్పఱచిన యట్టిపవిత్రదినములందే యట్టిపక్వాన్నములఁ దినవలయునుగాని మనయిష్టానుసారముగ నేదోయొక్కటి కల్పించి, యాదినమున నసామాన్యములయిన పిండివంటలతోఁ జిత్రాన్నదధ్యోదనములతోఁ, బరమాన్నములతో నుదరపూరణ మొనర్పఁదగదు. చేత సొమ్మున్నదికదా; అంగ డిలో ఘృతపిష్టాదివస్తువు లున్నవికదా; పడమటింటి బానిసతనముకుఁ బరిపూర్ణవితంతు వగు వదినెయున్నదికదా; ఒడల దారఢ్యమున్నదికదా; ఉదరమున క్షుత్తున్నదికదా; యని నీ కిష్టమైన దినమున నకారణముగ పాకపుగారెలు; పలావు తినవచ్చునా? తగదు. పెద్దలను దలఁచుకొనుచు, పూర్వమహావీరుల సంస్మరించుకొనుచు, నవతారపురుషులలో వారినారాధించుచుఁ గాలమును గడపవలసినపవిత్రదినములందే యిట్టి యారగింపు లాచరింపవలయును. అంతేకాని రుచివైవిధ్యముకొఱకు, కండల పుష్టికొఱకు, నైహికసుఖముకొఱకు, రక్తపటిష్టతకొఆకు, నరముల యుద్రేకమునకై యిష్టానుసారముగ మనము బలాహారముల నేమియుఁ దినఁదగదు.

"యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః,
తే త్వఘం భుంజతే పాపాయే పచంత్యాత్మకారణాత్."

ఆత్మ కారణముగ వండుకొనువారు భుజించునది అఘము కానియన్నము కాదని శ్రీకృష్ణభగవానులు సెలవిచ్చినారు. అట్టివారు తమకొఱకై వండుకొనుటయే పాపము. భుజించుటవఱ కక్కఱయేలేదు. శరీరపుష్టికై యైహికసుఖమునకై భోజనప్రయత్న మొనర్చువారు పాపులని స్పష్టపడినదికదా.

ఐహికనుఖదినములయిన వివాహదినములందు నిరంకుశముగ మన మన్నిపిండి వంటలు తినుటలేదా యని యందురేమో? అదేమిమాట? మన కులదేవతలు కాక ముప్పదిమూడుకోట్ల దేవతలు వివాహవేదికపై నాహ్వానింపఁబడియున్నారు. వివాహమైహిక నుఖమునకుఁ గానేకాదు. మన పెద్దలు దాని నట్టు గణింపనేలేదు. స్వర్లోకవాసులకు పెద్దలకు నివాపవారి నిచ్చి వారియుత్తమగతుల సంరక్షించుటకు, నిత్యదేవతాపూజాకార్యమునకు, నతిథిసత్కారమునకు, స్వార్థపరిత్యాగియై పరోపకారముకొఱకు పాటుపడుటకును బనికి వచ్చు వంశపావనుడైన కొడుకును దెచ్చుకొనుటకు నేర్పఱుపఁబడిన వివాహతంత్ర మైహిక సుఖతంత్రమా? ధర్మమందే చరించుట కీయాశ్రమము తీసికొనుచున్నామని యగ్నిసాక్షిగఁ బ్రమాణము లొనర్చుకొన్న భార్యభర్తల ప్రథమసమావేశోత్సవములో నైహికగ్రంథలేశమైన నున్నదా?

పర్యవసానమునఁ జెప్పున దే మనంగా మనము తీసికొనుచున్న యాహార మున్నదే, అది యైహికమార్గమందు బల మిచ్చుటకుఁగాదు; ఆముష్మికకార్యములందు దీక్ష నిచ్చుటకు. లాంపట్యవృద్దికొఱకుఁగాదు; వైరాగ్యివృద్దికొఱకు. రక్తికొఱకుఁ గాదు; భక్తికొఱకు స్వసేవకొఱకుఁగాదు; పరసేవకొఱకు. శరీరముకొఱకుఁగాదు; ఆత్మకొరకు. ఇంతింత స్వల్పాంశములందుఁగూడ మన పెద్దలు మన కహంభావము రాకుండ, దేహమత్తత కలుగ కుండ, స్వార్థలోలత పెరుంగకుండఁ, బశుత్వము వృద్దికాకుండ, జాగ్రత్తపెట్టుటకుఁ