దీనియర్థ మేమనఁగా, జనులు నిందింతురను భీతిని వదలిపెట్టి నిర్దుష్టముగా గవిత్వము చెప్పవలసినది. నిందలేదన్నమాట యెన్నడును లేదు. కవుల వాక్కుల యెడలఁ గాంతలయెడల జనులు తప్పనే తడవుచుందురు. నటుడు నిర్దుష్టమగు స్తోత్రమును కోరినప్పడు సూత్రధారుడిదియంతయు జెప్పనేల? నటుని మాటకు సూత్రధారుని మాట సందర్భమైన ప్రత్యుత్తరముగాఁ గనబడు చున్నదా? ఒకవేళ నటుడు “సూత్రధారా! నేను స్తోత్రము రచియించిన యెడలఁ తప్పలు వచ్చునేమో నీవే నిర్దుష్టముగాఁ జెప్పవలసిన' దని కోరినయెడల సూత్రధారునిపై ప్రత్యుత్తరము కొంత సందర్భముగా నుండునేమో భావికథా సూచనకు నంతకంటె ముఖ్యమైనది విమర్శకులను దిట్టుట కీ యవకాశమును బుద్దిపూర్వకముగఁ గవి కలిగించుకొనినాఁడని నాకుఁ దోఁచుచున్నది.
సోదరులారా! పై శుక్రవారమున నుత్తరరామచరిత చిత్రపటము అను విషయమును విమర్శింతును. అపండితుడవు. ననామకుడ వగు నీవు భవభూతిని విమర్శింతువా? తప్పకాదా? ఊరకుండుమని నన్ను దిట్టుదురా? కవులగ్రంథ సంచయమునకు, కాఫీహోట లునకు, నాకు భేద మగపడలేదు. హోటలునకుఁ బోయి పాకపుగారెలు తినునప్పడు పాకములోఁ దగినంత బెల్లము వేయలేదని యనుటకు నాకధికారము లేదా? నీవు మంచివంటగాడవైనట్టే తెగనీల్గుచున్నావే యని పై వారు కాని, యధికారిగాని నన్నుఁ దిట్టుట ధర్మమా? కవిత్వమేమి, చిత్రలేఖనమేమి, యభిరుచి ప్రధానమైన కళలు. నాయభి రుచి కనుకూలమైనదానిని నేను బాగుగ నున్నదందును. లేనిదానిని బాగుగ లేదందును. అది నా జిహ్వలోని గుణము కావచ్చును. దోషము కావచ్చును. ఆమాత్రమునకుఁ గవులకు నాపై గోప మెందులకు? ప్రజలకు నాపై గోప మెందులకు? నేను బాగుగా లేదన్నది బాగుగానుండఁగూడదా? నేను బాగుగానున్నదన్నది యోగుగా నుండఁగూడదా? కవులు గ్రంథములను దేశమున నెప్పడు విడిచిపెట్టినారో యప్పడే ప్రజలు వానిని విమర్శింప నధికారముగల వారైనారు. కళలకైనను గేవల మభిరుచియే ప్రధానమా? మంచిచెడ్డలను బరిశీలించు ప్రకృతిసూత్రము లేవియు నక్కఱలేదా? యని యధిషేపింతురా? ప్రకృతిసూత్ర ములను బట్టి వ్రాసినవా రెందఱు? అట్లు పరిశీలించినవా రెందఱు? నీ రుచి ననుసరించి నీవు వ్రాసినావు. నారుచి ననుసరించి నేను విమర్శించినాను. బొమ్మలో నాయుఁడు గారి మొగము సరిగా లేదని నే నంటిని. ఉన్నదని నీ వనుచున్నావు. తగవు పరిష్కారమున కేప్రకృతి సూత్రములు కావలయునో చెప్పఁగలవా? కావున నాచింతవలదు.
"ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః."