దెలియకపోయినను రవంతభావమైనను భర్తకు తెలిసియుండక మానదు.
భర్తయెంత చేతగానివాఁడైనను భార్య యెంత స్వతంత్రురాలైనను భర్త యింటలో నున్నంతకాలము భార్యకు విశేష స్వేచ్చయుండుట కవకాశము లేకపోయిన కారణముచేతఁ గాబోలు బాహ్యవిలాసముల తోడనే కాలక్షేపము జరిగినది. భర్త యిల్లు విడిచి లేచిపోయిన బాగుగ నుండునని భార్య యనుకొనినది. ఇంతలో దైవవశమున భర్త పెద తండ్రికి ప్రాణముమీదికి వచ్చినదని యాతనికి తంతివార్త వచ్చినది. అంతట నాతండు పోయినాఁడు.
భర్తయింట నుండినంతసేపు పైయవేక్ష కలిగియుండిన భార్యకు భర్త వెళ్ళినది మొద లావృత్తి సన్నగిల్లెను. ఇంటిలో నున్నవాడెన్ని విధముల బతిమాలినను నీమె యంగీకరింప లేదు. అది గాక నింటిలో భర్త యున్నప్ప డెందఱు పరపురుషు లున్నను బరిసిపాఱిపోవును గాని భర్తయింటిలో లేనప్పడు మాత్ర మొక్క పురుషునినైన నింట నుండనిచ్చుట సానివృత్తి కంటె భిన్నము కాదని యొఱింగియుండి కాఁబోలు నాతని నాయూరనే మఱియొక్కయింట నుండుమని చెప్పెను. ఈమె మిక్కిలి నాగరికతగల స్త్రీ యగుటచేత ననేకులగు నుద్యోగు లీమెతోఁ గరచాలన మొనర్చి మాటలాడుటకు వచ్చుట గలదు.
తరువాత గొలదిదినములలోనే ఈమెకు పక్షవాతము వచ్చెను. అట్లామె యొక్క సంవత్సరము మంచము మీఁదనే యుండెను. ఆమె మిత్రుడు తఱచుగ వచ్చిచూచుచుఁ జేతనైన యుపచారములను జేయుచుండెడివాడు. భర్త యొక్కడ నున్నాఁడని యామె తఱ చుగా నీతని నడుగుచుండెను. అతని పెదతండ్రి గ్రామములోనే యున్నాఁడనియు, నక్కడ నాతండు చిన్నపొలమును సంపాదించుకొని వ్యవసాయముచే జీవించుచున్నాడనియు, నిక్కడ కింక రాడనియు దన కాయూరనున్న మిత్రు డొకఁడు వ్రాసినాఁడని యామెతో నాతండు చెప్పెను. ఇట్లుండ నామెకుఁ బక్షవాతము పూర్తిగ నిమ్మళించేను. నామాట యేమని యామెను మిత్రుఁ డడిగెను. "నీవు నన్ను బెండ్లిచేసికొన వీలులేదు. నేను పడుచుకొనుట నాకిష్టము కాదు. నన్నేమి చేయుమంటివి' యని యామె పలికెను. “నిన్నే నేను వలచితిని. నిన్ను వదలువాఁడనుగాను” అని యాతడు పట్టుపట్టి కూరుచుండెను. ఇట్లుండ నొక్కనాఁడు భర్త పెద్దతండ్రి యొద్దనుండి యామెకు దంతి వచ్చెను. తనభర్త మరణించి నట్టు దానిలో నుండెను. ఇక్కడకుఁ బీడ వదలినదని యిద్దఱు కూడ సంతోషించిరి.
భర్తమృతికై యనేకు లీమెను బరామర్శించిరి. నెలదినములు కాకుండానే తాను దనమిత్రుని వివాహముచేసి కొందునని యామె ప్రకటించెను. సహజమైన ప్రేమ, దేశకాలాబాధితమని యందఱు సంతోషించిరి. వివాహదినమున నీమెను జూచుటకు వచ్చిన యుద్యోగు లకు లెక్క లేదు. ఒక హైకోర్టుజడ్డి కాబోలు నిందకొఱకు సెలవు పుచ్చుకొని Orr & Sons నుండి యొక హారముతో నామెను జూచుటకు వచ్చి యామెనాగరకతకు, యోగ్యతకు మిక్కిలి సంతోషించుచు నొక్క చక్కని యుపన్యాన మిచ్చెను. సిద్ధాన్నము కావున నారాత్రియే గర్బాధానము. రాత్రి గర్బాధానశయ్య యొద్దకుగూడ నెందఱో యుద్యోగులు వచ్చి యాయదృష్టవతిపై నభివందనములు వర్షించిరి. డిష్ట్రిక్టుబోర్డు ప్రెసిడెం టొక్క డామెతో గరచాలన మొనర్చి కెంపుపొడి గలయొక బంగారపు సూది యామెపైటపై గ్రుచ్చెను. ఉన్నతన్యాయస్థానాధికారి యొకడు వచ్చి యామె మస్తకమందు హస్తముంచి రెండవ హస్తముతో నామెబుగ్గలు పైకెత్తి పవిత్ర ప్రేమ పూర్ణమైన, దేవతా సంబంధమైన యొకముద్దును