17. క్షురకసభ
ఏలూరులో జరిగిన క్షురకసభకు జంఘాలశాస్త్రి అధ్యక్షుడిగా వెళ్లాడు. సభకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. జంఘాలశాస్త్రికి సభామందిరం దగ్గరకు సోడాబండి మీద కూర్చోపెట్టి లాక్కొని వెళ్లారు- గౌరవసూచకంగా-
రకరకాల పతాకాలు క్షురకసభకు గుర్తుగా అక్కడ సభాభవనం దగ్గర కట్టారు. దాదాపు వెయ్యిమంది దాకా ఆసభకు హాజరయ్యారు.
ఒక మంగలి సోదరుడు వేదికమీది కెక్కి, సాక్షి సంఘానికి చెందిన జంఘాలశాస్తిని ఎందుకు అధ్యక్షుడిగా ఉండమని కోరినమీద వివరించాడు. సాక్షిసంఘానికీ క్షురకమండలికీ ఉన్న పోలికలను వివరించాడు.
జంఘాలశాస్తి అధ్యక్షస్థానంనుంచి మట్లాడుతూ, ఈదినం శారదాచరిత్రలో అద్వితీయం కాగలదని నొక్కి చెప్పాడు. తను ఇక్కడ ఇలా వుండడం పూర్వజన్మ అనుబంధం అయి వుంటుందని సవినయంగా చెప్పాడు.
అనంతరం ఒక మంగలి సోదరవక్త పరిశోధకుడు, వేదికఎక్కి, క్షురక జాతికి బౌద్దమతంతో వున్న సంబంధం, దేశ చరిత్రలో క్షురకజాతివారు, పాలక ప్రభువుల సన్నిధిలోవుండి చేయించిన మంచిపనులు, వివరించాడు. అయితే ఈ పరిశోధన ఉత్సాహంలో క్షురక, క్షత్రియ జాతుల్ని ఏకం చెయ్యడంవల్లనూ, మంగళ్లలో ఏలూరు మంగళ్లు ఎక్కువ పరిశుద్దులనడం వల్లనూ, గొడవజరిగి, ఉపన్యాసం ముగించవలసి వచ్చింది.
మరొకవక్త వచ్చి-సున్నితమైన క్షురకర్మకీ, సారస్వత సృష్టికీ వున్న పోలికలు వివరించాడు. క్షురకర్మలో ఉన్న వేదాంతార్ధాన్నికూడా విశదంచేశాడు. ఇంతలో సభారంగం బయట రణరంగంగా మారడంవల్ల అధ్యక్షుడి ముగింపు వాక్యాలు లేకుండానే సభ ముగిసింది.
జంఘాలశాస్త్రి నేను వెడలినతరువాతి నిట్లు చెప్పెను:
ఎన్నడుఁజాడలేదు. ఎన్నఁడు వినలేదు. అట్టివైభవము హేలాపురమున 27 వ తేదీని కాననయ్యెను. క్షురకసభాశాలపై వేలకొలఁది పతాకములు వివిధవర్ణనిరాజమానములై ప్రకాశించెను. ఒక జెండాపై మంగలికత్తి చిత్రంప బడియున్నది. మఱియొక్క జెండాపై దావివి