ఈ పుట ఆమోదించబడ్డది

16. సభాస్వకీయ వ్యాపారములు

నెలకొకసారి ఉపన్యాసానికి బదులు సాక్షిసంఘపు సొంత వ్యవహారాలు చూసుకోవాలనే నియమం చొప్పున ఈసారి, సంఘానికి వచ్చిన ఉత్తరాలు చూడడానికి నిశ్చయించాడు జంఘాలశాస్త్రి.

ఒక ఉత్తరం శవచింతామణీ గ్రంధాలయ కార్యదర్శి వ్రాశాడు. వారి గ్రంథాలయంలో, సాక్షి ఉపన్యాస సంపుటాలు ఒకటు, మూడు మాత్రమే వున్నాయట. రెండు, నాలుగు సంపుటాలు "ఉచితం'గా పంపమని అభ్యర్ధన. అలాగ కవులు తమగ్రంథాలు పంపిస్తూంటారట.

ఈ లేఖ వ్రాసినాయన ఒక సూచన కూడా చేశాడు. కాలాచార్యులు, వాణీదాసు కూడా తరుచు ఉపన్యాసాలిస్తే బాగుంటుందని.

దానిమీద వ్యాఖ్య అనవసరమని తీర్మానించారు. రెండో ఉత్తరం, కృష్ణాగోదావరీ మండలాలలోని యావదాంధ్ర క్షౌరశాలల సామాన్యకార్యదర్శి నుంచి వచ్చింది. ఏలూరులో ఈ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయంలో, పద్దెనిమిదవ వార్షికోత్సవం జరగబోతోందనీ, దానికి అగ్రసనాధిపతిగా రావలసిందనీ, జంఘాలశాస్త్రికి ఆహ్వానం.

దీనికి అంగీకరించడమా? మానడమా? అని చర్చకు పెట్టగా-వాణీదాసు, వెళ్లాలని చెప్పాడు. కాలాచార్యులు వ్యతిరేకించాడు. కాని -ఉపన్యాసం ఉంటుందని వినడానికి అక్కడకు జేరిన ఇతరశ్రోతలు ఊరుకో లేదు. వారిలోంచి ఒకడు లేచి, జంఘాలశాస్త్రి ఆ సభకు వెళ్లకపోతే వచ్చే నష్టాల గురించి చెప్పి, వెళ్లి తీరాలని ప్రతిపాదించాడు. మిగిలినవారు కరతాళ ద్వనులలో ఆమోదించారు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

ఈదినమున నుపన్యాస మేదియును లేదు. పూర్వనియమానుసారముగా మాసమున కొకతూరి సభాసంబంధము లగుసంగతులను గూర్చి సల్గాపించు కొందుము. ఉపన్యాన ముండు నని పెద్ద లందఱు వచ్చినారు. కావున నాయనలారా! ఉపన్యాసము లేనందులకు క్షమించి మావ్యవహారములలో మీకుఁ దోచిన యభిప్రాయముల నొసంగి తోడుపడఁ గోరుచున్నాను. సాక్షికార్యాలయమునకు వచ్చిన లేఖల జదివెదను.