తులు వేలువేఱుగా విరివిగా నుండుటచేత జ్ఞానమే మోక్షమసాధనమని తన బుద్దిచే నమ్మిన శంకరాచార్యులు ద్వైతశ్రతులను ముక్కముక్కలక్రింద నఱికి వాని కద్వైతార్ధమును గలిగించి నారు. భక్తియే మోక్షసాధక మని నమ్మిన రామానుజాచార్యు లద్వైత శ్రతులకు జచ్చిచెడి ద్వైతార్ధమును గల్పించినారు. పూర్వాచార్య పురుషులగువా రిట్టే వారి వారిమనస్సులలోఁ దమయభిప్రాయములచేతఁ బూర్వమే సంకల్పించుకొన్న సిద్ధాంతములఁ బట్టి కాలస్థితులవలనఁ గలిగిన సొంత నమ్మకములఁ బట్టి వ్యాఖ్యానములు చేసినారేకాని మీగ్రంథ మందున్న యథార్థసత్యమును గ్రహింపలేదని యిప్పటి యాచార్యపురుషులనుచున్నారు. కాని యిప్పటివారి వ్యాఖ్యానములుకూడ సరిగా నిట్టి యధిక్షేపణకే లోనై యున్నవి. ఈ అత్తగారు తన్ను బాధించినదని యాక్షేపించిన యిల్లాలు తాను కోడలిని బాధపెట్టకుండ జరుపుకొన వలసినది. అట్టు జరుగుట కవకాశము లేకపోయినది.
మహర్షిపురందరా! భగవద్గీతకు నిజమైన యర్దమేదో నాకు బోధింపఁదగదా! యని ప్రార్డించితిని. ఆయన ముసిముసినవ్వులు నవ్వినాడు. దానివలన నా కప్పటి కేమి తెలిసిన దనంగా పూర్వుల వ్యాఖ్యానములు సరియైనవి కావని యాయన యభిప్రాయ పడినట్టు నాకు గోచరమైనది. కాని యీ యంశము నిశ్చయముగాఁ దేలకపోవుటచేత గ్రుచ్చి గ్రుచ్చి మఱియొకసారి యడిగితిని. అంతట నాతండు తన ప్రక్కనున్న కఱ్ఱనెత్తినాడు. కొట్టునేమో యని లేచి యిప్పటివారు చెప్పినట్లు భగవద్గీతకు బడితెబాజాయే యర్ధమా యని యనుచుండఁగా నన్ను లేపినాఁడు. స్వప్నము సరి.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః