ఈ పుట ఆమోదించబడ్డది

నీరులేని స్థలమని రెండుస్థలములు వేర్వేఱుగ నచ్చట నున్నవి కాని యిచ్చట శాలలేని చోటు శాల కనబడుచున్నది. ఒకటా? చెప్పలేనన్ని నేను లేనిచోట నేను గనబడుచు న్నాను. ఒక్క నేనా లెక్కలేనన్ని నేను గృహనిర్మాణకళా (architecture) సంబంధమగు నింద్రజాలమునకు వశుండ నై కలవరపడితిని. అంతలో మనసు రవంత గుదుట బఱచుకొని నన్నునే నిట్టు నిందించుకొంటిని. 'సాక్షి శిష్యుడ వగునీకీ బుద్దిహీనత యేల? ఇది యొక్క భ్రమమా? ఇది యొక్క యింద్రజాలమా? ఇంతకంటె కోటిగుణములు భ్రమాపాదక మైన యింద్రజాలములో నఱువది సంవత్సరములనుండి పడియుంటివి కాదా? ఆ మహా మాయ కలవాటుపడియుంటివి కాదా “ప్రకృతిలోఁ బ్రతిఫలించిన పరమాత్మగాన బఱచిన మహామహేంద్ర జాలమేకాదా. ఇన్ని లక్షలగోళములు, ఇన్నికోట్టజీవరాసులు. అనంతమై యప్రమేయమై యద్వితీయమైన ఈసృష్టియంతయు మహేంద్రజాలమే కాదా? పరబ్రహ్మాపా దకమైన భ్రమకు పరిపాటియైన నీవు పాదుషాభవనమున నిట్లు భ్రమపడెద వేల యని నన్ను నేను నిందించుకొంటిని. అంతలో నిమ్మళముగ ననినట్లు నాకు వినబడి ఉలికిపడి వెనుకకు జూచితిని. మావంక నేలచూచెద వని వెనుకనున్న నేను లన్నియుఁ నన్నుఁబ్రశ్నించెను.

మనస్సులోఁ గలిగిన తొట్రుపాటు నివారించుకొని నిదానముగ నచ్చటి చిత్రములన్నియుఁ బరిశీలించితిని. పైగప్పుపరాలపైఁ జెక్కబడిన పుష్చములు లతలు ఫలములు పక్షులు బొమ్మలు బంగారము మీది పనికంటె నెక్కువ సుకుమారముగ సున్నితముగ సురుచిరముగ నున్నవి. కొన్నిదూలములకుఁ గొన్నిస్తంభములకుఁ గొన్నిగవాక్షములకుఁ గొన్నివిగ్రహములకుబైన నుల్లిపొరవంటి బంగారురేకులు కప్పఁబడియున్నవి. నడుమ నడుమ నవసరానుసారముగ నలంకారార్ధముగ గల్ల కెంపులు వైడూర్యములు స్పటిక ములు పుష్పరాగములు మఱియు ననేకములుగా మణులు చెక్కబడి యున్నవి. జిగజిగలా మిలమిలలా తళతళలా! ఓ! వచించుటకు శక్యముకాని వింతకాంతులు ప్రజ్వరిల్లుచున్నవి. ఆసమయమున నెవఁడో వచ్చి యగ్గిపుల్లను వెలిఁగించెను. ఆహాహా! ఏమి వైభవము? నూఱుఇంద్రధనువు లొక్క త్రుటికాలములో నచ్చట నవతరించి వెలిఁగిపోయిన ట్లయ్యెను. అత్యంత మాధుర్యమునం ద్వరలో మొగము మొత్తును. అత్యంతదీప్తిచేఁ గన్నులు జీకట్లు పడును. అత్యంతోష్ణముచే వేగం జలికలుగును. అత్యంతశీతలతచే జ్వరము కలుగును. అత్యంతసౌందర్యమున-మనసు మొద్దెక్కును. నిర్జీవసౌందర్య మెంతసేపాకర్షింపఁగలదు? జీవత్సాందర్యమునకే దిక్కులేదే- కన్నుముక్కు తీరు నితరావయములసౌరు, నెక్కడ నేయం గుండవలయునో యాయంగుల నన్నింటిని మించిన రంగుమాత్రమే కల యంగన సైతమొకదినము కంటె నెక్కువ యాకర్షింపలేదే. సౌందర్యము సంతతాకర్షణీయముగ నుండుట కెన్ని పరిస్థితులు తోడుపడ వలయును. అవి తోడుపడని యెడల గోనెగుడ్డమీది నూనెబొమ్మయెట్టిదో యదియు నట్టిదే. ఈవిషయమును గూర్చి ప్రత్యేకముగఁ జెప్పెదను గాని యిప్పడు చెప్పఁదగదు.

సౌందర్యానుభవమునఁ జప్పబడిన మనసుతో నింటికై మరలిపోబోవగ నెదుట గోడపై బంగారువర్ణములుగల రెండు పంక్తులు గానంబడెను. అవి హిందుస్థానివర్ణములు. ఆ వ్రాతలోని యభిప్రాయ మేమనంగా:-భూలోకమందు స్వర్గమే యున్నయెడల నది యిదే. అది యిదే. అది యిదే. వెగటుపడిన మనస్సుతో నుంటినేమో, నాకామాటలు మఱింత వెగటయ్యెను.