ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు


శ్రీ పిఠాపురము మహారాజులయిన శ్రీమద్రావు వేంకట మహిపతి గంగాధర రామరాయలవారి యాస్థాన కవిపండితులలో నెన్నికగన్న బ్రహ్మశ్రీ దేవులపల్లి సుబ్బయ శాస్త్రిగారును, వారి తమ్ములయిన వేంకటకృష్ణ శాస్త్రిగారును శతఘంటి కాద్యవధానములు పెక్కు లొనర్చి, రాజసత్కారములు పొంది, కీర్తిశేషులయిన మహాకవులు.

వీరిలో రెండవవారు శ్రీగంగాధరరామరాయల కోరిక ననుసరించి, యీ రావువంశముక్తావళి యనుగ్రంథమును రచించి యా మహారాజు గారికే యంకితము చేసినారు.

ఈ గ్రంధము కేవలము చారిత్రక గ్రంథమే యైనను వివిధ వర్ణనములతోను, శబ్దాలంకారములతోను, నర్థాలంకారములతోను, సులువుగా బోధపడఁ గల శ్లేషలతోను, మనోహరములైన ముచ్చటలతోను, ముద్దులొలుకు కమ్మని తేట తెలుఁగు మాటలతోను మృదు మధుర శైలిని రసవంతముగా రచితమయినది. ఆంధ్రసాహిత్యకావ్య శ్రేణిలో నీ ప్రబంధ ముత్తమ శ్రేణికిఁ జెందఁదగిన కావ్యముగా నున్నది.